హాంకాంగ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం హాంకాంగ్‌లో తాయ్ పో జిల్లాలోని 5 భారీ అపార్ట్‌మెంట్ భవనాల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో చాలా మంది అపార్ట్‌మెంట్ భవనాల్లోనే చిక్కుకుపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఫైరింజన్ల సాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 700 మంది నివాసితులను రక్షించి తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారని, మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఐదు బిగ్ టవర్స్ మంటల్లో కాలిపోయి పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.