సౌతాఫ్రికాతో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. భారత్‌పై చారిత్రక విజయం సాధించిన దక్షిణాఫ్రికా టీమ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 549 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బుధవారం ఐదో రోజు 63.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. పరుగుల పరంగా భారత్‌కు టెస్టుల్లో ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం. మరోవైపు భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సౌతాఫ్రికాకు ఇది రెండోసారి. గతంలో హాన్సి క్రోనే సారథ్యంలోని దక్షిణాఫ్రికా టీమ్ భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. తాజాగా తెంబబవుమా కెప్టెన్సీలో సఫారీ మరోసారి ఇలాంటి ఫీట్‌ను సాధించడం విశేషం. కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్ చేతిలో క్లీన్‌స్వీప్‌కు గురైన టీమిండియా మరోసారి సౌతాఫ్రికా చేతిలోనూ ఇలాంటి అవమానకర ఓటమిని చవిచూసింది. కివీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ను 30తో చిత్తుగా ఓడించింది. తాజాగా సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి టీమిండియాకు కోలుకోలేని దెబ్బతీసింది.
వరుస క్రమంలో..
ఓవర్‌నైట్ స్కోరు 27/2తో బుధవారం చివరి రోజు ఆటను తిరిగి ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్ (5) పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ మరోసారి నిరాశ పరిచాడు. రెండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి తేలిపోయాడు. 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మారథాన్ ఇన్నింగ్స్ ఆడినసాయి సుదర్శన్ 139 బంతుల్లో 14 పరుగులు చేసి ఇంటిదారి పట్టాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా 87 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ (16) పరుగులు చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి, సిరాజ్‌లు ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల వద్దే ముగిసింది. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హార్మర్ 37 పరుగులకే ఆరు వికెట్లు తీశాడు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లను పడగొట్టాడు.