బెట్టింగ్‌కు బానిసగా మారిన ఎస్సై ఏకంగా సర్వీస్ రివాల్వర్‌ను తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నాడు. అంతేకాకుండా చోరీ కేసులో రికవరీ చేసిన ఐదు తులాల బంగారం కూడా కుదువ బెట్టుకున్నట్లు బయటపడింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపికి చెందిన భాను ప్రకాష్ 2020లో ఎస్సైగా ఎంపికయ్యాడు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పనిచేశాడు. ప్రస్తుతం అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఎస్సైగా పనిచేస్తున్నాడు. భానుప్రకాష్ బెట్టింగ్‌కు బానిసగా మారండంతో వచ్చే జీతం కుటుంబ అవసరాలకు, బెట్టింగ్ కట్టేందుకు సరిపోవడంలేదు. దీంతో తన వద్ద ఉన్న రివాల్వర్‌ను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు, రౌండ్స్ మాత్రం తన పిఎస్‌లోని తన డెస్క్‌లో దాచి పెట్టాడు.
రౌండ్స్ కుదువ పెట్టుకున్న వ్యక్తికి ఇస్తే ఎక్కడైన ఫైరింగ్ చేస్తే తాను ఇరుక్కుంటానని భావించి ఇవ్వనట్లు తెలిసింది. కాగా ఇటీవల భానుప్రకాష్ ఎపిలో నిర్వహించిన గ్రూప్2లో ఎఎస్‌ఓగా ఎంపికయ్యాడు. ఆ ఉద్యోగంలో చేరాలంటు ఇక్కడ రిలీవ్ కావాల్సి ఉంటుంది, దానికి తన వద్ద ఉన్న అన్నింటినీ ఎస్‌హెచ్‌ఓకు హ్యాండ్‌ఓవర్ చేయాల్సి ఉంది. దీని కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన భానుప్రకాష్, డెస్క్ తన రివాల్వర్ మిస్సింగ్ అయిందని ఇన్స్‌స్పెక్టర్ కిరణ్‌కు చెప్పాడు. రౌండ్లు ఉన్నాయని, రివాల్వర్ మాత్రమే పిఎస్ నుంచి మిస్సింగ్ అయిందని చెప్పాడు. ఎందుకైనా మంచిది అని ఇన్స్‌స్పెక్టర్ కిరణ్ పిఎస్‌లో ఉన్న సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలిద్దామని చూశాడు. ఫుటేజ్‌లో భానుప్రకాష్ బంగారం తీసుకుని వెళ్తున్నట్లు బయటపడింది, దానిపై నిలదీయగా తాను కుదువ బెట్టుకున్నానని చెప్పాడు.
వెంటనే ఇన్స్‌స్పెక్టర్ పై అధికారులకు సమాచారం ఇవ్వగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. భానుప్రకాష్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించగా, బెట్టింగ్‌కు బానిసగా మారానని డబ్బుల కోసం రివాల్వర్ తాను కుదువ బెట్టానని ఒప్పుకున్నట్లు తెలిసింది. వెంటనే ఉన్నతాధికారులు భానుప్రకాష్‌ను సస్పెండ్ చేశారు. రివాల్వర్ బెట్టింగ్ కోసం కుదువబెట్టాడా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.