టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హిట్స్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది ‘కింగ్‌డమ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు విజయ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా జూలైలో విడుదలైంది. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ మూవీ తర్వాత ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌తో జతకట్టాడు విజయ్. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ ‘విడి14’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, మమ్మీ చిత్రం విలన్ ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారనే వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే వినోద్ సాగర్‌తో కలిసి ఆర్నాల్డ్ వోస్లూ కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమాలో ఆర్నాల్డ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారా..? లేక మరేదైనా రోల్‌లో నటిస్తున్నారా.? అనే చర్చ కూడా జరుగుతోంది.