ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన వి. నవీన్ యాదవ్ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యాదవ్ తో ప్రమాణం చేయించారు. అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర మంత్రులు డి. శ్రీధర్ బాబు, అజహరుద్దీన్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. నవీన్ కుమార్ పార్టీ నాయకులతో, తన అనుచరులతో అసెంబ్లీకి ఊరేగింపుగా వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నిక ప్రచారం సమయంలో విపక్షాల నేతలు తనను, తన కుటుంబ సభ్యులను అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపినాథ్ మరణించకపోయినా ఉప ఎన్నిక జరిగేదని అన్నారు. మాగంటి మరణించడంతో తాము ఎన్నికల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నామని ఆయన చెప్పారు. తనను గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి రుణాన్ని తీర్చుకుంటానని ఆనవీన్ యాదవ్ తెలిపారు. మజ్లీస్ పార్టీ నేతలకూ నవీన్ కృతజ్ఞతలు తెలిపారు.