హైదరాబాద్: పైరసీ సినిమాల కేసులో అరెస్టు అయిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ సినిమాలను పైరసీ చేస్తున్న ఇమ్మడి రవిని ఇటీవల హైదరాబాద్ కు రావడంతో సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని నాంపల్లి కోర్టులో హాజరపర్చగా.. ఐదు రోజుల పోలీస్ కస్టడికి అనుమతిచ్చింది. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అతడిని విచారణ చేశారు. దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. రవి ఒక్కడే సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఐదేళ్ల నుంచి సినిమాలను ఐ బొమ్మ వెబ్‌సైట్ ద్వారా పైరసీ చేస్తున్న రవి బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్, మ్యాట్రీమోని వెబ్‌సైట్లను ప్రమోట్ చేయడం ద్వారా రూ.100కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీస్ కస్టడి ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టగా..బుధవారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లో రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. దీంతో మరోసారి కోర్టు పోలీస్ కస్టడికి అనుమతించే ఛాన్స్ ఉంది.