గౌహతి: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా కష్టాల్లో చిక్కుకుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించిన సఫారీ టీమ్ ఆతిథ్య భారత జట్టు ముందు 549 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే బుధవారం చివరి రోజు భారత్ మరో 522 పరుగులు చేయాలి. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (6), యశస్వి జైస్వాల్ (13) ఇప్పటికే పెవిలియన్ చేరారు. జైస్వాల్‌ను జాన్సన్, రాహుల్‌ను సిమన్ హార్మర్ వెనక్కి పంపారు. కీలకమైన ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆట ముగిసే సమయానికి సాయి సుదర్శన్ (2), కుల్దీప్ యాదవ్ (4) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు 26/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌతాఫ్రికాను ట్రిస్టన్ స్టబ్స్, టోని డి జోర్జి ఆదుకున్నారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్టబ్స్ 180 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 94 పరుగులు చేశాడు. జోర్జి (49), ముల్డర్ 35 (నాటౌట్), రికెల్టన్ (35), మార్‌క్రమ్ (29) పరుగులు సాధించారు. కాగా, సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేయగా భారత్ 201 పరుగులకే కుప్పకూలింది.