న్యాయం సత్వరం, సకాలంలో పొందడం పౌరుడి ప్రాథమిక హక్కు. కానీ, భారతదేశంలో న్యాయస్థానం గడప తొక్కిన ఏ పౌరుడికైనా, కేసు చిన్నదా పెద్దదా అనే విషయంతో సంబంధం లేకుండా పరిష్కారానికి ఏళ్లూపూళ్లూ పడుతోందంటే అతిశయోక్తి కాదు. న్యాయం జరగడంలో ఆలస్యమైతే అది అన్యాయంతో సమానమన్న హితోక్తి ఆచరణలో అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో పెండింగ్ కేసుల పరిష్కారం, మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడం తన ముందున్న రెండు ప్రధాన ప్రాధాన్యతలని జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు చేసిన ప్రకటన న్యాయ వ్యవస్థ ప్రక్షాళనకు సమయం ఆసన్నమైందని సూచిస్తోంది. వివాదాలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం గేమ్ ఛేంజర్ కావచ్చునన్న ఆయన అభిప్రాయం నూటికి నూరుపాళ్లూ వాస్తవం. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్ కేసుల సంఖ్య జస్టిస్ సూర్యకాంత్ మాటల్లో చెప్పాలంటే 90 వేలకు పైమాటే. ఇక జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ ప్రకారం దేశవ్యాప్తంగా కిందిస్థాయి కోర్టులలో 4.78 కోట్ల కేసులు, హైకోర్టులలో 63.80 లక్షల కేసులు పరిష్కారం కావలసి ఉంది.
ఒక్క తెలంగాణ హైకోర్టులోనే దాదాపు 2.36 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. కేసులు ఇలా కొండల్లా పేరుకుపోవడానికి కారణం న్యాయమూర్తులు, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమి, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సవరణలకు నోచని చట్టాలు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దేశంలోని 25 హైకోర్టులలో ఉండాల్సిన 1122 మంది న్యాయమూర్తులకు గాను మొన్న జులై నాటికి 751 మందే ఉన్నారు. ఈ లెక్కన పెండింగ్ కేసులు పరిష్కారం కావాలంటే ఒక్కొక్క న్యాయమూర్తి 8,400కు పైగా కేసుల విచారణ జరపాల్సి ఉంటుంది. ఇక జిల్లా, సబార్డినేట్ కోర్టులలో మొత్తం 25,741 న్యాయమూర్తుల పోస్టులకు 5262 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనాభాకు సరైన నిష్పత్తిలో న్యాయమూర్తులు లేకపోతే, ప్రజలలో న్యాయస్థానాలపై విశ్వసనీయత సన్నగిల్లుతున్న ఇంగితం పాలకుల్లో కొరవడిన కారణంగానే ఈ దుస్థితి దాపురించింది. న్యాయస్థానాల్లో మౌలిక వసతుల కల్పనకు, ఇతరత్రా సౌకర్యాలకూ బడ్జెట్‌లో చాలినన్ని నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కేసుల సత్వర పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం, సర్వోన్నత న్యాయస్థానం కొత్త రకం విధానాలను అందిపుచ్చుకునేందుకు అడుగులు వేస్తున్నాయి.
న్యాయమూర్తుల కొరతను అధిగమించేందుకు హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోవాలన్న ఆలోచన ఈ కోవకు చెందినదే. 224ఎ రాజ్యాంగ అధికరణ ఇందుకు అనుమతినిస్తున్నా, ఈ తరహా నియామకాలు త్వరితగతిన జరగడం లేదు. సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 89కి సవరణ జరపడం ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి బాట వేయడం, ప్రత్యేక లోక్ అదాలత్‌ల ఏర్పాటు వంటివి కూడా చెప్పుకోదగిన పరిణామాలే. కానీ పెండింగ్ కేసుల పరిష్కారానికి ఈ చర్యలు ఏ మాత్రం చాలవని చెప్పడంలో సందేహం అక్కరలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భారతీయ న్యాయస్థానాలు వెనకబడి ఉన్నాయి. చైనా, ఎస్టోనియా, జర్మనీ వంటి దేశాలు కృత్రిమ మేధ సహాయంతో చిటికెలో వందలాది కేసులను పరిష్కరిస్తున్నాయి. ఈ దేశాల్లో అమలవుతున్న న్యాయ నమూనాలను ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరిశీలించి, కొందరు జిల్లా న్యాయమూర్తులను ఎంపిక చేసి సింగపూర్‌లో శిక్షణ ఇప్పించింది.
ముంబయి, బెంగళూరు, ఢిల్లీల్లో ఎఐ టెక్నాలజీని వినియోగించి కేసుల పరిష్కారానికి ఓ పైలట్ ప్రాజెక్టునూ నిర్వహించారు. దీనివల్ల పెండింగ్ కేసులు 20 శాతం మేర తగ్గినట్లు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ అధ్యయనంలో తేలింది. అయినప్పటికీ ఈ విధానాలు అమలుకు నోచుకోకపోవడం మన దేశంలో పాలనాపరమైన అలసత్వానికి ఒక నిదర్శనం. ఈ నేపథ్యంలో న్యాయం పొందడమనేది ఒక సుదీర్ఘమైన, కాలాతీతమైన, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగా సగటు భారతీయుడు భావిస్తున్నాడంటే ఆశ్చర్యమేముంటుంది? వివాదం ఎంతటి తీవ్రమైనదైనా దేశంలో 40% మంది న్యాయస్థానాల గడప తొక్కకుండా, పెద్ద మనుషుల సాయంతోనో, ఇతరేతర విధానాల ద్వారానో పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపుతున్నారని ఆ మధ్య ఓ అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు భారత కొత్త ప్రధాన న్యాయమూర్తి ఇతోధికంగా కృషి చేస్తారని ఆశిద్దాం.