ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిస్థితి అలాగే ఉంది. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నదన్న నేపథ్యంలో మన పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఉన్నంత గందరగోళంగా ఏ రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు. ఒకేవరలో రెండు కత్తులు ఇమడలేని విధంగా మన పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒకే అధికార పరిధిలో రెండు పదవులు సృష్టించి అధికారులు, ప్రభుత్వాలు తమాషా చూస్తున్నారు తప్ప మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలో అధికార విభజన సమస్యలు లేకుండా చూసేందుకు ఇష్టపడడం లేదు? ఉన్న లోపభూయిష్టమైన పంచాయతీ రాజ్ వ్యవస్థ స్వరూపాన్ని మూడంచెల అధికారస్థాయిగా వికేంద్రీకరణ చేయడానికి బదులు, నాలుగు అంచెలుగా అస్తవ్యస్త అధికార విభజన చేయడంతోపాటు, అధికార విభజనలో అస్పష్టతతో చోద్యం చూస్తున్నారు. ఒకే అధికార పరిధిలో రెండు పదవులు పెట్టి రాజకీయ సవతి పోరుకు తెరలేపడమేకాక, ఒకే అధికార పరిధిలో రెండు ఎన్నికలను జరిపి, ఎన్నికల పేరుతో ఎంతో ప్రజాధనం వృథా చేస్తున్నారు. అదేమిటో పరిశీలన చేద్దాం. వాస్తవంగా గ్రామ సర్పంచ్, మండలం ప్రాదేశిక నియోజకవర్గం సభ్యుల (ఎంపిటిసి) అధికార పరిధి ఒక్కటే, అయితే, పదవులే వేర్వేరు. ఎన్నికలు మాత్రం రెండు పదవులకు జరగాలి. సర్పంచ్, ఎంపిటీసి ఇద్దరూ ఒకే మండల పరిషత్తులో సభ్యులుగా ఉండి ఆయా గ్రామాల నుండి ద్విప్రాతినిధ్యం వహించుతారు. ఎవరు సమావేశంలో సమస్య లేవనెత్తినా ఒక్కటే అంశం.
ఇకపోతే మండల స్థాయిలో మండల పరిషత్తు అధ్యక్షుడు, జిల్లా ప్రాదేశిక నియోజికవర్గం సభ్యులది ఒకే అధికార పరిధి. అంతేకాదు ఒకే మండలం నుండి జిల్లా పరిషత్తులో రెండు ప్రాతినిధ్యాలు అవసరమా? అంతేకాదు, మండలంలో ఎంపిటిసి, జిల్లాలో జడ్‌పిటిసిలకు మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వరకే ప్రాధాన్యత ఉంటుంది. అటుతర్వాత వారి అధికారాలు తాలింపులో కరివేపాకు మాదిరే! ఇకపోతే గ్రామ స్థాయిలో సర్పంచ్, ఎంపిటిసి ఎన్నిక, మండలస్థాయిలో జెడ్‌పిటిసి, మండల పరిషత్తు ఎన్నికల వలన రెండు ఎన్నికల నిర్వాహణ ఖర్చుతోపాటు, ఐదేండ్ల పాటు ఎంపిటిసి, సర్పంచ్, జెడ్‌పిటిసిలకు నెల సరిగా ఇచ్చే గౌరవ వేతనం, సౌకర్యాలు కల్పనకు అవుతున్న ఖర్చు ప్రజలపైనే అదనపు భారం మోపుతున్నారు తప్ప నిక్కచ్చిగా మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్మాణం, ఎన్నికల పద్ధతి మార్పు చేసుకుంటే! ఈ అధికార విభజన గందరగోళం, ఎన్నికలు, గౌరవ వేతనం పేరుతో చేసే ఖర్చులు ఆదా అయ్యే అవకాశం ఉంది.
ఒకసారి మన మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులను పరిశీలన చేసినట్లైతే మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంత గందరగోళంగా ఎందుకు తయారైంది? అనే అంశం అవగతం అవుతుంది. మనకు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1955లో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థకు రూపకల్పన చేసి, అధికార విభజన కూడా చేశారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎన్నికల ద్వారా ఎన్నిక అవుతారు. ఎన్నికైన సర్పంచ్‌లు బ్లాక్ అధ్యక్షుడును పరోక్ష పద్ధతిలో ఎన్నిక అవుతారు. ఈ బ్లాకు అధ్యక్షులు అందరూ కలిసి పరోక్ష ఎన్నిక ద్వారానే జిల్లా పరిషత్తు చైర్మన్‌ను ఎంపిక చేసుకునేవారు. అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్షంగా జరిగితే, పరోక్షంగా బ్లాకు, జిల్లాస్థాయి ఎన్నికలు అన్ని పూర్తి అయ్యేవి. అటు తర్వాత 1970 దశకంలో మాధ్యమిక వ్యవస్థ అయిన బ్లాకు స్థానంలో పంచాయతీ సమితి ఏర్పాటు చేశారు. ఇక 1977 నుండి 1987 మధ్య అనేక మార్పులు జరిగాయి. పంచాయతీ సమితి అధ్యక్షుడు, జిల్లా పరిషత్తు చైర్మన్ ఎన్నిక పరోక్ష ఎన్నిక నుండి ప్రజలే నేరుగా ఎన్నుకునే విధంగా ఎన్నికల విధానం మార్చారు.
అటు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్‌టిఆర్ అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీ రాజ్, రెవెన్యూ వ్యవస్థ స్వరూపం మార్చివేశారు. పాలనా సౌలభ్యం పేరుతో పంచాయతీ సమితి వ్యవస్థను రద్దుచేసి మండలం ప్రజాపరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు పేర్లతో నామకరణం చేశారు. మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్తు అధ్యక్షుడు ఎన్నికకు నేరుగా ఎన్నికలు జరిపించారు. అటు తర్వాత ఆయనే మండల ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపిటిసి) జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్‌పిటిసి) లుగా విభజించి ఎన్నికలు జరిపించారు. దీనితో మూడంచెల వ్యవస్థ కాస్తా గందరగోళంగా మారిపోతుంది. అటు తర్వాత 1992 లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా, రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్ ఆర్టికల్ 243 ననుసరించి స్థానిక స్వపరి పాలనా సంస్థలకు స్వయం పాలనా హక్కుగా గిరిజనులకు పీసా చట్టం లాంటి హక్కులు సంక్రమింపజేయడంతో మన స్థానిక స్వపరిపాలన వ్యవస్థ బలోపేతం అయింది. అయితే ఎంపిటిసి, జెడ్‌పిటిసి, సర్పంచ్‌లకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపి, ఎంపికైన వారి ద్వారా పరోక్ష ఎన్నిక ద్వారా మండల పరిషత్తు, జిల్లా పరిషత్ అధ్యక్షులు ఎన్నికలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత 2018లో కెసిఆర్ నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని తెచ్చినప్పటికీ తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడంతప్ప అందులో కొత్తదనం పెద్దగా ఏమీ లేదు. ఉన్న ఎన్నికల విధానాన్నే యథాతథంగా కొనసాగిస్తూ వచ్చారు. ఫలితంగా పంచాయతీ, మధ్యమ స్థాయి, ఉన్నత స్థాయి లో రెండు రకాల ప్రజాప్రతినిధులు వ్యవస్థలు వచ్చి గందరగోళంగా, ప్రజలకు భారంగా మారింది. వాస్తవంగా గ్రామ సర్పంచ్, ఎంపిటిసి ఎన్నికల పరిధి దరిదాపు ఒక్కటే! ఇక అధికారాలు విషయానికి వేస్తే ఎంపిటిసిలకు మండలాధ్యక్షుల ఎంపిక, తొలగింపు అంశాలలో ప్రాధాన్యత తప్ప గ్రామ పంచాయతీపై మరే అధికారాలు లేవు. ఇక సర్పంచ్ గ్రామ పరిపాలనపై పూర్తి ఆధిపత్యం ఉంటుంది. మండల పరిషత్తు సమావేశంలో పాల్గొనే హక్కు ఉంటుంది కానీ, ఓటింగ్ విషయంలో, బిల్లుల, బడ్జెట్ ఆమోదం లాంటి ఎలాంటి హక్కులు లేకపోవడం వలన, మండల పరిషత్తు సమావేశంలో తమ సమస్యలు ప్రశ్నించడం తప్ప, మండల అధ్యక్షుడు, అధికారులను నియంత్రణ చేసే ఎలాంటి అధికారం లేని నామమాత్రపు సభ్యులుగా సర్పంచ్‌లు మండల పరిధిలో ఉంటారు. ఇక జిల్లా స్థాయి లో కూడా అదే పరిస్థితి ప్రత్యేకంగా ఎన్నికైన జెడ్‌పిటిసి సభ్యులు జిల్లా పరిషత్తు చైర్మన్ ఎన్నిక చేసే, లేక అవిశ్వాసం పెట్టగల అధికారం కలిగి ఉంటారు.
ఇక జిల్లా పరిషత్తు సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షలు పాల్గొన్నా, మండలంలో సర్పంచ్‌లు ప్రాతినిధ్యం మాదిరే ఇక్కడ మండలం అధ్యక్షుడు అధికారాలకు కత్తెర వేయబడుతుంది. అంటే దీన్ని బట్టి మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికల విధానం, అధికారాల విభజన, అధికార పరిధి అంతా గందరగోళంగా మార్చివేశారు. ప్రభుత్వాలు మారుతున్నా అదే అధికార విభజన, అదే ఎన్నికల విధానం తప్ప అనర్థదాయకం అయిన, ఖర్చుతో కూడిన ఎన్నికల విధానం సంస్కరణ చేద్దామనే ఆలోచనకు ఎవరూ సాహసించడం లేదు. ఒక్క గ్రామ పంచాయతీ ఎన్నిక ప్రత్యక్షంగా నిర్వహిస్తే, పరోక్ష ఎన్నికల ద్వారా మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్మాణం అయ్యే అవకాశం ఉన్నా కొత్త ఒక వింత పాత ఒక రోతలాగా మన పంచాయతీ రాజ్ వ్యవస్థను చూస్తూ, అధికారాలు విభజన గందరగోళం, మూడంచెల వ్యవస్థకు బదులు, ఆరో వేలులాగా నాలుగంచెల వ్యవస్థను ఏర్పరచి చేతులు దులిపేసుకుంటున్నారు. కనుక స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ప్రాధాన్యత ఇటీవల కాలంలో పెరిగింది. పనికి ఆహార పథకం, సమీకృత గ్రామీణ అభివృద్ధి నిధులుకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యం, పచ్చదనం పేరుతో గ్రాంట్లు విడుదల చేయడంతో కాస్తా గ్రామీణ ప్రాంతం రూపురేఖలు మారాయి. వైకుంఠధామాలు, రైతువేదికలు, సచివాలయాలు, క్రీడా ప్రాంగణాలు, పారిశుద్ధ్య సిబ్బంది, సిమెంట్ రోడ్లు లాంటి సౌకర్యాలు మెరుగైన నేపథ్యంలో మన స్థానిక స్వపరిపాలన సంస్థల్లో స్పష్టమైన మార్పులు చేయడం, తప్పులు సరిదిద్దడం, స్పష్టమైన అధికార విభజన చేయడం అత్యవసరమే! అందుకు వివిధ రాష్ట్రాలలో ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్థ అధ్యయనం ఎంతో కొంత తోడ్పడే అవకాశం ఉంది. స్థానిక స్వపరిపాలన వ్యవస్థను సరైన మార్పులు తో పటిష్టం చేయవలసిన కనీస బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది.
ఎన్ తిర్మల్
94418 64514