ఇరవైఏళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతతో, వయస్సు పైబడి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న నితీశ్‌కుమార్ మరోసారి బీహార్‌లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసంభవం అని ఎన్నికల ముందు చాలామంది అంచనా వేశారు. అయితే ఎవ్వరూ ఊహించని రీతిలో ఘనవిజయం సాధించడమే కాకుండా, ప్రతిపక్షాల ఉనికిని ప్రశ్నార్థకం కావించారు. 2025 బీహార్ ఎన్నికల పోరాటంలో నితీశ్ నాయకత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఎన్నడూలేని విధంగా సంపూర్ణ మద్దతు అందించారు. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు కేవలం నితీశ్ రాజకీయ భవిష్యత్‌ను మాత్రమే కాకుండా తన రాజకీయ భవిష్యత్‌పై సైతం కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. బహుశా నితీశ్‌కు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు. ఫలితాలు రాగానే ప్రధానితో కనిపించిన ఉత్సాహం, మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలిపిన విధానం చూస్తే గతంలో ఆయన ఆ విధంగా వ్యవహరింపలేదని గుర్తింపవచ్చు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి 400 సీట్లు గెలిపించబోతున్నట్లు దేశమంతా ప్రచారం చేసుకుంటే, 240కు మించి సీట్ల సాధించలేకపోయారు. మోడీ ‘ప్రజాకర్షణ’ ఓవిధంగా మసకబారింది. ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలలో బిజెపి ఘనవిజయాలు సాధించినా అందుకు ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్రస్థాయిలో అమలు చేసిన వ్యూహాలే ఎక్కువ కారణంగా అందరూ భావించారు.
బీహార్‌లో గెలుపు సాధింపలేకపోతే ఇక ఓటర్లపై ‘మోడీ ఆకర్షణ’ ప్రభావం ఉండబోదనే నిర్ణయానికి దేశంలో అందరూ వచ్చే ప్రమాదం ఉంది. ముందుగానే ఈ ప్రమాదం గుర్తించడంతో, గత ఎన్నికలలో చిరాగ్ పాశ్వాన్‌ని చీల్చి, నితీశ్ పార్టీ పోటీచేస్తున్న సీట్లలో అభ్యర్థులను నిలబెట్టి ఆ పార్టీ అతి తక్కువ సీట్లు గెలుపొందేటట్లు చేశారు. ఈసారి కూడా ప్రశాంత్ కిషోర్‌తో జట్టుకట్టి నితీశ్‌ను ఓడించేందుకు చిరాగ్ సిద్ధ్దమవుతున్న సమయంలో బిజెపి కట్టడిచేసింది. గతంలో ఎన్‌డిఎ నుండి విడిపోయిన వారిని తిరిగి తీసుకొచ్చి అభేద్యమైన కూటమిని ఏర్పాటు చేసి, చెల్లాచెదురైన ఇండియా కూటమిని చిత్తు చేయడంలో బిజెపి ప్రత్యేక శ్రద్ద చూపింది. గతంలో మాదిరిగా జెడి(యు)ను మరింత బలహీనంగా చేస్తే మోడీ నాయకత్వంకే ముప్పు అని భయపడ్డారు. దానితో ఆ పార్టీ స్థానాల సంఖ్య రెట్టింపు అయింది (2020లో 43 సీట్ల నుండి 2025లో 85 సీట్లకు). బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినా ఆ పార్టీ స్థానాల సంఖ్య 74 నుండి 89కి మాత్రమే పెరిగాయి. మహిళలు, ఇబిసిలు, మహాదళితులలో నితీశ్ ఇప్పటికీ ఎదురులేని మద్దతు పొందుతూ ఉండడంతో ఆయన నాయకత్వానికి మద్దతు ఇస్తూ, ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగించక తప్పని పరిస్థితులు బిజెపికి ఏర్పడ్డాయి.
2014 ఎన్నికల ముందు కేవలం మోడీ నాయకత్వానికి మద్దతు ఇవ్వలేకనే ఎన్‌డిఎకు దూరమైన నితీశ్ కుమార్, ఇప్పుడు మోడీ నాయకత్వం జాతీయ స్థాయిలో బలపడేందుకు కీలకమైన వ్యక్తిగా మారారు. గత ఏడాది జనవరిలో లోక్‌సభ ఎన్నికల ముందు కూడా ఇండియా కూటమి నుండి నితీశ్ ఎన్‌డిఎ కూటమిలోకి మారకపోయి ఉంటే, మోడీ మూడోసారి అధికారంలోకి రావడం ప్రశ్నార్థకంగా మారి ఉండెడిది. బిజెపి సీట్ల సంఖ్య 240 నుండి మరింతగా తగ్గిపోయి ఉంటే ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు మోడీ వెనుకడుగు వేసి ఉండేవారని చాలామంది భావిస్తున్నారు. బీహార్ లోని 40 సీట్లలో 30 సీట్లను నితీశ్ రావడంతో ఎన్‌డిఎ గెల్చుకుంది. ఆ విధంగా మోడీని రాజకీయంగా నితీశ్ రెండు సార్లు ఆదుకున్నారని చెప్పవచ్చు. అసలు మోడీకి వ్యతిరేకంగా బిజెపియేతర పక్షాలను ఓ వేదికపైకి తీసుకు వచ్చి, ఇండియా కూటమి ఏర్పాటుకు బలమైన కృషి చేసింది నితీశ్ కావడం గమనార్హం. దానితో సహజంగానే ఆయన ఆ కూటమికి నాయకత్వం వహించాలని ఆశించారు.
అయితే, అదే జరిగితే ఆయనే కాబోయే ప్రధాని అభ్యర్థి కాగలరనే భయంతో ఒకవంక రాహుల్ గాంధీ, మరోవంక మమత బెనర్జీ అడ్డుతగలడంతో ఆయనకు ఆ కూటమి నుండి బైటకురాక తప్పలేదు. ఆ విధంగా ప్రధాని అభ్యర్థిగా దాదాపు దశాబ్దంపాటు ప్రచారంలో ఉన్న నితీశ్ తన రాష్ట్రానికి పరిమితం కావలసివచ్చింది. గతంలో సైతం కాబోయే ప్రధానిగా ప్రచారం పొందిన సర్దార్ పటేల్, ఎన్‌డి తివారి, శరద్‌పవర్, ఎల్‌కె అద్వానీ, ప్రణబ్ ముఖర్జీ వంటి వారు రాజకీయంగా ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చింది. అయితే నితీశ్ స్వరాష్ట్రంలో తన పట్టును మాత్రం నిలబెట్టుకుంటూ వచ్చారు. నితీశ్‌ను ఇండియా కూటమి నుండి వెళ్లకుండా అడ్డుకోగలిగి ఉంటె బిజెపి సీట్ల సంఖ్య మరింతగా తగ్గిఉండెడిది. నితీశ్ రాకతో సీట్లు 240కు తగ్గినా, నితీశ్, చంద్రబాబు నాయుడుల కీలక మద్దతుతో మరోసారి మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. నితీశ్‌ను కోల్పోయిన కారణంగానే ఇండియా కూటమి బీహార్‌లో సైతం ఘోర పరాజయం ఎదుర్కోవలసి వచ్చింది. తనకు ప్రతికూలంగా మారిన పరిస్థితులను సైతం సానుకూలంగా మార్చుకోవడంలో బిజెపి కొంతకాలంగా రాటుతేలుతుంది. అదే కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల్లో విజయంకోసం కన్నా తమ కుటుంబం పట్టు కాపాడుకొనే ప్రయత్నంలో రాజకీయంగా వరుస పరాజయాలకు గురికావాల్సి వస్తుంది.
బీహార్ ఫలితాలతో ఇండియా కూటమి రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూటమికి ఓ నాయకత్వం గాని, అజెండా గాని, కనీసం తరచూ సమావేశాలు జరుపుతూ ఉండటం గాని లేకుండాపోయింది. చివరకు పార్లమెంట్ సమావేశాల్లో చెప్పుకోదగిన ఉమ్మడి ప్రయత్నాలు కూడా కనిపించడం లేదు. బీహార్ ఎన్నికల ఫలితాలు రాగానే ప్రధాని మోడీ ప్రసంగం వింటే కాంగ్రెస్‌కు, ప్రాంతీయ పార్టీలు మధ్య మరింత అగాధం పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.బిజెపి కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవాలలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ‘ప్రతికూల రాజకీయాల్లో’ మునిగిపోవద్దని, దాని నుండి దూరంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ తన మిత్ర పార్టీల ఓటు బ్యాంకులను మింగేసే ‘పరాన్నజీవి’ అని ఆయన హెచ్చరించారు. కొద్దీరోజులలో కాంగ్రెస్ పార్టీలో మరో చీలిక అనివార్యం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
వచ్చే ఏడాది జరుగబోయే రాష్ట్రాలలో కాంగ్రెస్, -బిజెపియేతర పార్టీలు బలమైన ఉనికి కలిగి ఉండడంతో కాంగ్రెస్ గురించి ప్రాంతీయ పార్టీలను హెచ్చరించే ప్రయత్నం చేశారు. టిఎంసి పాలిత పశ్చిమ బెంగాల్, డిఎంకె పాలిత తమిళనాడు, వామపక్ష పాలిత కేరళలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పుడు బిజెపి ప్రధానంగా బీహార్ తర్వాత బెంగాల్ పై దృష్టి సారిస్తోంది. అక్కడ టిఎంసితో కాంగ్రెస్ చేతులు కలపకుండా నివారించే ప్రయత్నంచేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. మరోవంక, ఇంతటి ఘనమైన విజయం సాధించినా బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని భావించలేం. వచ్చే ఐదేళ్లలో అక్కడ ఎన్ని రాజకీయ మార్పులైనా జరిగే అవకాశం లేకపోలేదు. బీహార్‌లో తమ నేత ముఖ్యమంత్రి కావాలని బిజెపి బహిరంగంగానే తమ లక్ష్యాన్ని వెల్లడిస్తూ వస్తుంది. కీలకమైన హోం మంత్రిత్వ శాఖను ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి దక్కించుకోవడం ద్వారా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రజలలో ఆయనకు గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం ప్రారంభమైనదని చెప్పవచ్చు.
నితీశ్ కుమార్ గెలుపుకు ప్రధానమైన కొన్ని సామాజిక వర్గాలలో ఆయనపట్ల తిరుగులేని నమ్మకం ఏర్పడటంతో పాటు పరిపాలన దక్షుడిగా, ‘జంగిల్ రాజ్’ లో శాంతిభద్రతలు కొనసాగేటట్లు చేయడం, మహిళల సంక్షేమంపట్ల ప్రత్యేక దృష్టి సారించడం ప్రధాన కారణం అన్నది అందరికీ తెలిసిందే. పైగా, సుదీర్ఘకాలం కులాల సమీకరణలో రాజకీయాలు కేంద్రీకృతం అయిన రాష్ట్రంలో మొదటిసారి మహిళా సంక్షేమం, యువత, ఉద్యోగాలు వాటిని సామాజిక అంశాలను ప్రధాన రాజకీయ అజెండాగా మార్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఈ విషయంలో ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ సొంత పార్టీలోనే విశ్వాసం పొందలేకపోయారు. ఇప్పటికే పరిపాలనలో మంచి అనుభవం ఉన్న ఇబిసి వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి హోం మంత్రిగా శాంతిభద్రతల విషయంలో సైతం చెరగని ముద్ర వేసేటట్లు చూడటం ద్వారా బీహార్ ప్రజలలో ప్రజాకర్షణ గల నాయకుడిగా ఎదిగే విధంగా బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. అది జరిగితే, జెడి(యు)లో చీలిక తీసుకురావడం, నితీశ్ కుమార్ ను ఒంటరి చేయడం పెద్ద కష్టం కాబోదు. ఇప్పటికే జెడి(యు) నాయకులు అనేకమంది బిజెపికి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ప్రజావ్యతిరేకత రానివిధంగా బీహార్‌లో పాగావేయాలని బిజెపి వ్యూహంగా కనిపిస్తుంది.
చలసాని నరేంద్ర, 98495 69050