మన తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ బ్యూరో: నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష(డిసిసి) ఎంపిక కొత్తచిచ్చుకు దారితీసింది. డిసిసి అ ధ్యక్ష పదవి కోసం చాలామంది ముఖ్యులు పోటీపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓయు ఉద్యమనేత పున్న కైలాశ్‌నేతకు డిసిసి బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరులు కష్టపడి పనిచేసే వారికి పదవులు ఇవ్వరు.. పార్టీని, ముఖ్యులను తిడితేనే పదవులు ఇస్తారా? అంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రధానంగా మంత్రి ప్రధాన అనుచరుడు గుమ్ముల మోహన్‌రెడ్డి అధిష్ఠానం తీరును తప్పుబట్టారు. కష్టకాలంలో పనిచేసిన వా రికి గుర్తింపు ఇవ్వకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. అయితే డిసిసి అధ్యక్షుల ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రకేబినేట్ సమావేశానికి ముందు సీఎం రేవంత్‌తో చర్చించినట్లు చెపుతున్నారు. గతంలో తనను, తనకుటుంబాన్ని అసభ్య పదజాలంతో తిట్టడం.. పార్టీకోసం ఏనాడు కష్టపడని వ్యక్తికి డిసిసి పీఠం కట్టబెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. డిసిసి అధ్యక్షుడిగా పున్న కైలాశ్‌నేతను వెంటన తొలగించాలని మంత్రి పట్టుపడుతున్నారు. సీఎం రేవంత్‌తో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు లేఖ రాసినట్లు చర్చ జరుగుతుంది.
ఇదిలా ఉంటే గతంలో తనను దూషించిన వ్య క్తికి జిల్లాపీఠం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు వెంట నే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు (డిసిసి) పదవుల చిచ్చు నల్లగొండ జిల్లాలో తారాస్థాయికి చేరిందని చెప్పవ చ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం రేవంత్‌కు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. ఈపరిణామాలతో వారిబంధం బెడిసికొడుతుందా? అనే చర్చ మొదలైంది. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాల్లో పై ర్‌బ్రాండ్‌గా ఉంటూ విపక్షంతో పాటు స్వపక్షంపై విమర్శలు చేయడం వారికి అలవాటు. అయితే ఈ పరిస్థితుల్లో డిసిసి ఎంపిక సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతుందా అనే చర్చ ప్రారంభమైంది. ఎట్టిపరిస్థితుల్లో డిసిసి అధ్యక్షులుగా పున్న కైలాశ్‌ను ఒప్పుకునేది లేదని వెంటనే తొలగించాలని మంత్రి కోమటిరెడ్డి పట్టుపడుతున్నారు. డిసిసి ఎంపిక చిచ్చు నల్లగొండ కాంగ్రెస్‌లో ఏవైపుకు దారితీస్తుందోనన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ అధిష్టానం ఏనిర్ణయం తీసుకుంటుంది? కోమటిరెడ్డిని బుజ్జగిస్తుందా? కైలాశ్‌నేతకు నచ్చచెపుతుందా? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనని అందరూ ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు.