మన తెలంగాణ/హైదరాబాద్: భాగ్యనగరంలోని పారిశ్రామిక భూములపై రచ్చ మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ భూములను గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ ప్రకారమే తాము నడుచుకుంటున్నామని అధికార పార్టీ నేతలు చెబుతుండగా ప్రతిపక్ష బిఆర్‌ఎస్ మాత్రం కోట్ల రూపాయలను దోచుకునేందుకు పారిశ్రామిక భూములపై ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. దీని కో సం పరిశ్రమల శాఖ రూపొందించించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పా లసీ పాలసీని ఇటీవల మంత్రిమండలి ఆమోదిం చి జీవో కూడా జారీ చేసింది. పారిశ్రామికవాడల ను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ‘హిల్టప్’ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రా న్స్‌ఫార్మేషన్ పాలసీ) పేరుతో ఓ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. పారిశ్రామిక ప్రాంతాల్లో జనజీవనం పెరగడంలో కాలుష్య ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని నగరం నడిమధ్యలో ఉన్న పరిశ్రమలను ఓఆర్‌ఆర్ వెలుపల నూతన పారిశ్రామికవాడలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే హిల్టప్ విధానాన్ని తీసుకువచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) లోపల, సమీపంలోని అన్ని టీజీఐఐసీ/ఐఏఎల్‌ఎ పరిధిలోని అన్ని పారిశ్రామిక ఎస్టేట్లు, ఆటోనగర్‌లు స్వతంత్ర పరిశ్రమల భూములకు ఈ విధానం వర్తిస్తుంది. దీని పరిధిలోకి వచ్చే భూముల్లో అపార్టుమెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, కార్యాలయాలు, రిటైల్ సెంటర్లు, హోటళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఐటీ/ ఐటీఈఎస్ పార్కులు, రిక్రియేషన్ సౌకర్యాలు వంటివి నిర్మించడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. హైదరాబాద్‌లోని పాత పారిశ్రామిక ఎస్టేట్‌లు పార్కులు ఇప్పుడు అత్యంత విలువైన భూములుగా మారాయి. పెట్టుబడులు, పరిశ్రమలు రావాలనే లక్ష్యంతో 50- నుంచి 60 ఏండ్ల కిందట ప్రభుత్వం సబ్సిడీ ధరలకు పరిశ్రమలకు భూములను కేటాయించింది. దీంతో అప్పట్లో నగర శివారు ప్రాంతాలుగా ఉన్న 22 చోట్ల పారిశ్రామికవాడలు ఏర్పడ్డాయి. కాలక్రమంలో నగరం వేగంగా విస్తరించడంతో అప్పట్లో శివారు ప్రాంతాలుగా ఉన్న పారిశ్రామికవాడల చుట్టూ ఇప్పుడు జనావాసాలు ఏర్పడ్డాయి. అప్పట్లో ఏమాత్రం ధర పలకని భూములు ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి. గతంలో పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో చాలావరకు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.
టెక్నాలజీ మారడంతో చాలా పరిశ్రమలు ఖాయిలా పడగా అనేక పరిశ్రమలు మార్కెట్ పోటీని తట్టుకోలేక మూతబడ్డాయి. దీంతోపాటు ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న పారిశ్రామికవాడలను ఔటర్ వెలుపలికి తరలించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, సమీపంలోని పాత పారిశ్రామికవాడలు ప్రస్తుతం హైదరాబాద్ నగరం మధ్యలో చిక్కుకున్నాయి. బాలానగర్, కూకట్‌పల్లి, కాటేదాన్ వంటి ప్రాంతాల్లో వేల ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది. వేర్వేరు ప్రాంతాల్లోని పారిశ్రామిక జోన్లలో సుమారు 9,292 ఎకరాలను పరిశ్రమల శాఖ గుర్తించింది. వీటిలో సుమారు 4,740 ఎకరాల చదును భూముల్లో అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించింది. ఈ భూములను నివాస, వాణిజ్య, ఐటీ, ఆసుపత్రులు, పార్కులతో కూడిన బహుళ ప్రయోజన ప్రాంతాలు (మల్టీయూజ్ జోన్లు)గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ వెలుపల పలు పారిశ్రామికవాడలను ఏర్పాటుచేసి నగరంలోని పరిశ్రమలకు సబ్సిడీ ధరలకు అక్కడ భూములు కేటాయించారు. ఇలా నగరంలోని పారిశ్రామిక వాడలకు చెందిన వేలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈఈ భూములను మల్లీయూజ్ జోన్లుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇలా
టీజీ-పాస్ పోర్టల్ ద్వారా హిల్టప్ విధానానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని మొదట 20 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టీజీఐఐసీ 7 రోజుల్లో ప్రాథమిక పరిశీలన చేసి స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పరిశ్రమలు) అధ్యక్షతన ఆమోద కమిటీ మరో 7 రోజుల్లో అనుమతి ఇస్తుంది. మిగిలిన 80 శాతం ఫీజును రెండు విడతలుగా 45 రోజులకోసారి మొత్తంగా 90 రోజుల్లో చెల్లించవచ్చు. సబ్సిడీ ధరలకు కేటాయించిన భూములను లీజు పూర్తయిన తర్వాత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడమో, బహిరంగ మార్కెట్ ధర ప్రకారం వారివద్ద ధర వసూలు చేసి వారికి యాజమాన్య హక్కులు కల్పించడమో చేయాలి. ప్రభుత్వం ‘హిల్టప్’లో భాగంగా రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం ఫీజుగా వసూలుచేసి వారికి భూ వినియోగ మార్పిడి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది.
9292 ఎకరాల్లో హిల్టప్ పాలసీ
నగరంలోని మొత్తం 22 పారిశ్రామికవాడల్లో 9292.53 ఎకరాల భూమి ఉంది. నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, మౌలాలీ, ఉప్పల్, కూకట్‌పల్లి, ఐపీ జీడిమెట్ల, ఎస్‌వీసీఐఈ జీడిమెట్ల, ఐపీ బాలానగర్, టీఐఈ బాలానగర్, ఎస్‌వీసీఐఈ బాలానగర్, ఐపీ సనత్‌నగర్, ఐపీ మేడ్చల్, కుషాయిగూడ, సీఐఈ గాంధీనగర్, పటాన్‌చెరు, ఐడీఏ పాశమైలారం, రామచంద్రాపురం, కాటేదాన్, హయాత్‌నగర్, స్టాండ్ ఎలోన్ ట్యాండ్స్, చందూలాల్ బారాదరి తదితర పారిశ్రామికవాడల్లో ఈ భూములు ఉన్నాయి. ఈ భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పాలసీ ద్వారా వేల ఎకరాల నిరుపయోగమైన భూమి వినియోగంలోకి రావడంతోపాటు ఐటి, రియల్ ఎస్టేట్, హౌసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు రావడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాష్ట్రానికి వేల కోట్ల నాన్ ట్యాక్స్ ఆదాయం రావడం వల్ల సేకరించిన డబ్బులో 25 శాతం మళ్లీ కొత్త ఇండస్ట్రియల్ పార్కులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడుతాయని ఈ పాలసీని తీసుకువచ్చినట్లు చెబుతున్నారు.
లీకు వీరులపై కఠిన చర్యలు తప్పవు : ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలు, కేబినెట్ సమావేశంలో జరిగిన చర్చల సారాంశం మొత్త ప్రతిపక్ష నేతలకు చేరవేస్తున్న లీకు వీరుల విషయంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు శ్రీధర్ బాబు స్పందిస్తూ ఈ లీకుల విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని కేబినెట్ నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాల లీకులపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో కేబినెట్ సైతం ఇదే ఆలోచనతో ఉందన్నారు. కేబినెట్ నిర్ణయాలు చాలా కాన్ఫిడెన్షియల్ అని అలాంటిది ఇంకా జీవోలు రాకముందే వాటి సారాంశం ఇతరులకు చేరవేయడమంటే చాలా తీవ్రమైన నేరమని, అలాంటి ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో ఐఎఎస్ అధికారుల పాత్ర ఉన్నా చర్యలు తప్పవని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు.