ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవిని అతడి భార్య పట్టించలేదని, ఆమె ఎలాంటి వివరాలు ఇవ్వలేదని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ క్రైం శ్రీనివాసులు తెలిపారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే పట్టుబడ్డాడని, అతడి స్నేహితుడిపై నిఘా పెట్టడంతో పట్టుబడ్డాడని తెలిపారు. ఐ బొమ్మ రవి కేసు గురించి అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవికి బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ద్వారా డబ్బులు వచ్చేవని తెలిపారు. యాడ్ బుల్ కంపెనీ రవికి చెందినదేనని, యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులను యాడ్ బుల్ కంపెనీకి మళ్లించారని చెప్పారు. ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బుల వచ్చేదని, రవి సర్వర్లన్నీ నెదర్‌లాండ్‌లో ఉన్నాయని తెలిపారు. రవి టీం ఇంకా కరేబియన్ దేశంలోనే ఉన్నారని తెలిపారు.
రవికి హైదరాబాద్, వైజాగ్‌ల్ ఉన్న ఆస్తులను గుర్తించామని, ఇప్పటికే బ్యాంక్‌లో ఉన్న రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఇమంది రవి ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల వరకు సంపాదించాడని వెల్లడించారు. ఐబొమ్మ, బప్పం సైట్లను రవి స్నేహితుడు నిఖిల్ డిజైన్ చేశాడని తెలిపాడు. నిఖిల్, రవికి స్నేహితుడని, పైరసీ వెబ్‌సైట్లు డిజైన్ చేసేవాడని, అతడి ద్వారానే రవిని ట్రాప్ చేశామని తెలిపారు. గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ద్వారా నూ నిందితుడు బోలెడు డబ్బు సంపాదించాడు. ఇవే కాకుండా మరికొన్ని పైరసీ వెబ్‌సైట్లు నడుస్తూనే ఉన్నాయని, మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ వంటి పైరసీ సైట్లు ఇంకా నడుస్తున్నాయని తెలిపారు. పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఐబొమ్మ పాపులర్ అయ్యాక దానిపేరును చాలామంది వాడుకుంటున్నారని, సినిమా సమీక్షలకు కూడా ఐబొమ్మ సైట్ పేరు పెట్టుకున్నారని తెలిపారు. భవిష్యత్‌లో వెబ్-3 టెక్నాలజీ కూడా రాబోతుంది, ఈ టెక్నాలజీతో పైరసీ చేస్తే పట్టుకోవడం కష్టం అని స్పష్టం చేశారు.
రీడైరెక్ట్…
ఐ బొమ్మ డొమైన్‌ను ఎన్ జిల్లా అనే కంపెనీలో రవి రిజిస్టర్ చేశాడని, మరో కంపెనీ నుంచి హోస్ట్ చేశాడని అదనపు సిపి శ్రీనివాసులు తెలిపారు. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా ఐ బొమ్మ, బప్పం ద్వారా సినిమాలు పోస్ట్ చేశాడని తెలిపారు. బప్పం, ఐబొమ్మ వెబ్ సాఫ్ట్‌వేర్‌లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశారని, రీడైరెక్ట్ ద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్ సైట్లకు వెళ్లేదని తెలిపారు. అక్కడ వాటి యాడ్లను, యాడ్ క్యాష్, యాడ్ స్టరా అనే కంపెనీలు మేనేజ్ చేస్తున్నాయని తెలిపారు. బెట్టింగ్ సైట్లు యాడ్స్ డిస్‌ప్లే చేయడం ద్వారా వచ్చే డబ్బు ఇమ్మడి రవి ఖాతాలోకి వెళ్లేది తెలిపారు.
మరోసారికి కస్టడీకి…
రవి పోలీస్ కస్టడీలో సహకరించలేదని, ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, మరోసారి కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబడతామని మంగళవారం నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఎవరికీ కాపీలు ఇవ్వొద్దంటూ పోలీసుల మెమో దాఖలు చేశారు. దీని వల్ల కస్టడీ విచారణ నీరుగారుతోందని కోర్టుకు విన్నవించారు. అయితే కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కస్టడీకి పిటీషన్‌పై బుధవారం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.