న్యూఢిల్లీ : ఢిల్లీఎన్‌సిఆర్‌లో అధ్వాన్నంగా తయారైన వాయు నాణ్యతను పరిష్కరించడానికి ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) చర్యలు చేపట్టింది. కాలుష్యానికి కారణమైన వాహనాలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రాజధానిలో ఎలెక్ట్రిక్ వాహనాల పర్యావరణాన్ని వ్యాపింప చేయాలని సూచించింది. ఢిల్లీలో గత రెండు వారాలుగా వాయు నాణ్యత పరమ అధ్వాన్నంగా ఉండడంతో ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి పిఎంఒ సమావేశం మంగళవారం జరిగింది.
నిబంధనలను ఉల్లంఘించిన కాలుష్యకారక వాహనాలను పూర్తిగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీఎన్‌సిఆర్ ప్రాంతంలో ప్రమాణాలు పాటించని 37 శాతం వాహనాలు కాలం చెల్లినవని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీ రోడ్లపై అనేక సంఖ్యల్లో ఎలక్ట్రిక్ వాహనాలు నడిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సౌకర్యాల కల్పనకు చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పాలని , సబ్సిడీలు అందించాలని సూచించారు. సంప్రదాయ పెట్రోలు, డీజిల్ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించాలని కోరారు.