త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎంపి డాక్టర్ మల్లు రవి ధీమాగా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సుఖ శాంతులతో ఉన్నందున స్థానిక ఎన్నికల్లో విజయం చేకూరుస్తారని విశ్వసిస్తున్నానని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని ఆయన చెప్పారు. పేదలకు సన్న బియ్యం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి రావాల్సి ఉన్న రూ. 3,500 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేస్తుందని ఆయన వివరించారు. విపక్షాల నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేయకుండా కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న ఉద్దేశంతో లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరు బాగుండడంతో జీర్ణించుకోలేకపోతున్న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మల్లు రవి విమర్శించారు.