మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి స్కీమ్‌కి తెర లేపిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. అందుకే 9,292 ఎకరాల భూమి దారాదత్తం చేసేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హెచ్‌ఐఎల్‌టిపి ..హిల్ట్ పి) పాలసీ తీసుకువచ్చిందని అన్నారు. గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకి గత ప్రభుత్వాలు పారిశ్రామిక వ్యక్తులకు ఇచ్చాయని తెలిపారు. అప్పటి మార్కెట్ రేట్‌కి సంబంధం లేకుండా అత్యంత చవకగా ఈ భూములను ఇచ్చారని అన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న 20 పారిశ్రామిక వాడలలోని 9,292 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
లక్షలాది కోట్ల రూపాయల భూములను అప్పనంగా చేస్తున్న ఈ భూముల దందా పైన వెంటనే ప్రజలను జాగ్రత్త పరుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని మంగళవారం విద్యార్థి నాయకులకు కెటిఆర్ దిశానిర్దేశం చేశారు. ఒకప్పుడు పరిశ్రమల కోసం, ప్రజల ఉపాధి కోసం వచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు అపార్ట్‌మెంట్లు కడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తున్నదని విమర్శించారు. తాము గతంలో తీసుకువచ్చిన గ్రిడ్ పాలసీలో భాగంగా 50 శాతం ఐటీ ఆఫీసులకు, మిగిలిన 50 శాతం ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వానికి తగిన ఫీజులు కట్టిన తర్వాత అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం దారాదత్తం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం చెల్లిస్తే చాలు అంటూ అప్పనంగా ఒకప్పటి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నదని, తద్వారా ఐదు లక్షల కోట్ల రూపాయల భూముల స్కామ్‌కు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు, ముని మనవడు వరకు కావాల్సినన్ని డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పాలసీ తీసుకువచ్చారని ఆరోపించారు.
ఈ పాలసీ ద్వారా రేవంత్ రెడ్డి అంబానీ సరసన నిలవాలని ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందని, అంత భారీగా దోపిడీ చేసేందుకు తెరలేపారని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో పార్కులకు, ఇళ్లకు, చివరికి స్మశానానికి కూడా జాగా లేకున్నా, ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములన్నింటినీ అప్పనంగా అప్పగిస్తున్నదని చెప్పారు. ఇదే అంశాన్ని బిఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు జిహెచ్‌ఎంసి జనరల్ బాడీ కౌన్సిలింగ్ సమావేశంలో నిలదీశారని తెలిపారు. 9,300 ఎకరాల హైదరాబాద్ భూములను, ప్రజల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా చేస్తామంటే ఊరుకోమని, అది కాంగ్రెస్ పార్టీ అబ్బ జాగీరు కాదని బల్దియా సమావేశంలో ప్రశ్నించినట్లు తెలిపారు.