ఉత్తర ప్రదేశ్: భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందని అన్నారు. జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగం ప్రధాని మోడీ ప్రారంభించారు. రామాలయ నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి అని.. ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని తెలియజేశారు. ఈ ధర్మధ్వజం భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం అని..సంకల్పం, సఫలతకు ఈ ధ్వజం చిహ్నం అని ప్రశంసించారు. ఈ ధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని, ఈ ధర్మధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణను ఇస్తుందని అన్నారు. కర్త, కర్మవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మధ్వజం చెప్తుందని, పేదలు, దు:ఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్యం వస్తుందని, కోట్లాది మంది రామభక్తుల కల ఇవాళ సాకారమైందని మోడీ పేర్కొన్నారు. రామమందిర నిర్మాణానికి సహకరించిన అందరికి నమస్కరిస్తున్నానని, ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో అమోధ్య చెప్తుందని తెలిపారు.
రాముడు కులం చూడడు.. భక్తి మాత్రమే చూస్తాడని, ఆధర్మ పురుషుడు శ్రీరాముడికి బేధభావాలు ఉండవని అన్నారు. శతాబ్దాల నాటి గాయాలకు ఇవాళ ఉపశమనం లభించిందని, ఐదు శతాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారమైందని అన్నారు. ధర్మధ్వజంపై ఉన్న కోవిదార్ వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీకని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన చుట్టూ కొందరు బానిస భావజాలం ఉన్నవారు ఉన్నారని, బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వొద్దు అని సూచించారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారత్ అని.. శతాబ్దాల క్రితమే భారత్ ప్రజాస్వామ్య విధానం ఉందని అన్నారు. తమిళనాడు ఉత్తర మేరూర్ శాసనం ప్రజాస్వామ్యం గురించి చెప్తోందని, భారత్ లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడని గుర్తుచేశారు. రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని బానిస భావజాలం ఉన్నవారని చెబుతున్నారని, వచ్చే వెయ్యేళ్లు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుందని, అయోధ్య రాముడిని ఇప్పటికే 45 కోట్ల మంది దర్శించుకున్నారని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
అయోధ్యలో రామమందిర శిఖరంపై వైభవంగా రామాలయ ధ్వజారోహణం మోడీ ఎగరవేశారు. ఆలయ శిఖరంపై కాషాయ పతాకాన్ని ఆవిష్కరించారు. అభిజిత్ ముహూర్తంలో రామాలయ శిఖరంపై ధ్వజారోహణం చేశారు. 2020 ఆగస్టు 5న రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. అయోధ్యలో 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట చేశారు. ధర్మధ్వజంపై శ్రీరాముడు, సూర్యుడు, ఓం కోవిదర చెట్టు చిహ్నాలు ఉన్నాయి. ధ్వజరోహణంతో అయోధ్య రామమందిర నిర్మాణం సంపూర్ణమైంది.