భారతదేశంలో సమాఖ్యవాదం ఏమేరకు మనుగడ సాగిస్తుంది. మార్పులేకుండా కొనసాగుతుందా. సహకార స్ఫూర్తి క్రమంగా చనిపోతుందా అన్నదే నేటి ప్రశ్న. సుప్రీంకోర్టు 2023 శర్మ కమిటీ తీర్పుతో మొదలై 2024, 2025లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై ఇచ్చిన తీర్పులలో కేంద్రం అధికారాలు అనంత స్థితిస్థాపకత (ఇన్ఫినిటి ఎలాస్టిసిటీ)- అన్నపదం వాడింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో జస్టిస్ (రిటైర్డ్) బి.ఆర్. మెహతా తీవ్ర పదజాలంతో రాసిన వ్యాసంలో ఆ తీర్పులలో కోర్టు సాంప్రదాయ సిద్ధాంతాలను విడిచి పెట్టి ఆక్రమణ కొత్త ప్రమాణాలకు అనుకూలంగా వ్యవహరించిందన్నారు. ఇది దాదాపు ఏ పాలనా రంగంలోనైనా జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసినట్లే. రాజ్యాంగం రాష్ట్రాలకు స్పష్టంగా కేటాయించిన రంగాలలో కూడా కేంద్రానికి శాశ్వతంగా, తిరుగులేని ఆధిపత్యాన్ని స్పష్టంగా ఆమోదించడం ఇబ్బందికరమైన అంశమే. ఈ న్యాయపరమైన మార్పు ఆందోళన కలిగిస్తుంది. ఇది అకస్మాత్తుగా జరిగిన పరిణామం కాదు. దశాబ్దాలుగా సాగుతున్న పరిణామాలకు పరాకాష్ట. గతంలో కాంగ్రెస్ అయినా, నేడు బిజెపి అయినా కేంద్రంలో అధికారం చేపట్టిన ఏ పార్టీ కూడా నిజమైన ఫెడరలిజం అనుసరిస్తూ, సుఖంగా ఉండలేదు.
ప్రతి పార్టీ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్ ప్రాథమిక విలువగా కాక, ఇబ్బందికరంగానే భావించాయి. కేంద్రప్రభుత్వాల పెత్తనం చెలాయింపు కొత్తకాదు. రిపబ్లిక్ గా అవతరించిన తొలి దశాబ్దాలనుంచి ఆర్టికల్ 356ను తరచు పక్షపాత ధోరణితో కేంద్రప్రభుత్వం వాడుకుంది. తమను ధిక్కరించిన రాష్ట్రప్రభుత్వాలను కూల్చివేసేందుకు, రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆర్టికల్ 356ను ఆయుధంగా ప్రయోగించింది. కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు, కర్ణాటకలో ఎస్‌ఆర్‌బొమ్మై సర్కార్‌లను రాత్రికిరాత్రి తొలగింపులే ఇందుకు ఉదాహరణ. ఎమర్జెన్సీ హయంలో 42వ రాజ్యాంగ సవరణతో మరింత దూకుడుగా వ్యవహరించింది. విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చడంతోపాటు పలు రంగాలపై కేంద్రం ఆధిపత్యం విస్తరించింది. ముఖ్యమంత్రులు నిజానికి ప్రణాళికా సంఘం ఫీల్డ్ ఆఫీసర్ల స్థాయికి దిగజారారు. కేంద్రం రూపొందించిన కేంద్రం స్పాన్సర్ చేసిన పథకాలనే అమలు చేయాల్సి వచ్చింది. కేంద్రం నిబంధనల ప్రకారమే నిధులు సమకూరుతాయి.
1990వ దశకం, 2000 దశకంలో సంకీర్ణ ప్రభుత్వాల పెరుగుదలతో ఫెడరలిజం పునరుజ్జీవనం జరుగుతుందన్న భ్రమ కల్పించింది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం, జ్యోతిబసు, లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఎన్‌టి రామారావు, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, నవీన్‌పట్నాయక్ వంటి నాయకుల రాకతో కేంద్రంతో బేరసారాలు ఆడే శక్తివచ్చింది. కేంద్ర -రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడానికి సర్కారియా, పుంచి కమిషన్లు చక్కటి సిఫార్సులు చేశాయి. అయినా ఆ కాలంలోనూ ఆర్థిక సమాఖ్యవాదం క్షీణించింది. సర్వీస్ టాక్స్, తర్వాత జిఎస్‌టి, రాష్ట్రాల స్వతంత్ర ఆదాయ అధికారాలను క్రమంగా తగ్గించాయి. కేంద్రం అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేకుండా జిఎస్‌టి కౌన్సిల్‌లో ఓటింగ్ వ్యవస్థతో కేంద్రానికి పూర్తి ఆధిపత్యం వచ్చేసింది. 2014లో కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రీకరణ వేగం పుంజుకుంది. ఆర్టికల్ 360 రద్దు, జమ్మూకశ్మీర్‌ను, దాని అసెంబ్లీ అనుమతి లేకుండా రెండు రాష్ట్రాలుగా చేయడం రాజ్యాంగాన్ని తూట్ల పొడవడమే.
ఎన్నికైన ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ నియంత్రణలోకి ఉంచే ఢిల్లీ ఎన్‌సిటి సవరణ చట్టం పెడరల్ విధానం సూచించిన సరిహద్దులను ఏకపక్షంగా చెరిపి, తిరగరాయడానికి కేంద్రం కొత్త సంసిద్ధతను సూచిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల విషయంలో కేంద్రం చొరబాట్లు పెరిగాయి. మూడు వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ మార్కెట్‌లో దూసుకొచ్చింది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన కార్మిక కోడ్‌లు కార్మిక నియంత్రణలో పెద్దఎత్తున పనిచేస్తున్నాయి. నీట్ ప్రవేశపెట్టడం, వివిధ విద్యా సంస్కరణలు రాష్ట్రాల పరిధిని దాటవేశాయి. కొవిడ్19 మేనేజిమెంట్ సాకుతో ప్రజారోగ్యంలో కేంద్రం ఆధిపత్యం మరింత పెరిగింది. ప్రతిపాదిత విద్యుత్(సవరణ)బిల్లు, ముసాయిదా ప్రసారబిల్లుతో కేంద్రం చొరబాటు మరింత విస్తరించే ప్రమాదం ఉంది.
ఆర్థిక నియంత్రణ మరో శక్తివంతమైన కేంద్రీకరణ సాధనంగా మారింది. కేంద్రం అందించే పథకాలకు నిధులు ఇప్పుడు 8, 9,- 10 లేదా 100 నిష్పత్తులలో పనిచేస్తున్నాయి. ఈ దెబ్బతో కేంద్రం రాష్ట్రాలను కేవలం పథకాలను అమలు చేసే ఏజెన్సీల స్థాయికి దిగజార్చింది. జిఎస్‌టిలో వాటా చెల్లింపులు పదేపదే ఆలస్యం కావడంతో రాష్ట్రాలు కనీసం జీతాలు చెల్లింపు, ఇతర బాధ్యతల నిర్వహణకు కూడా భారీగా రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆఫ్- బడ్జెట్ రుణాలు మాత్రం ఆర్థికలోటు లెక్కలనుంచి మినహాయింపబడడం విశేషం. ఈ విషయం లో రాష్ట్రాలపై పర్యవేక్షణ పెరిగింది. అప్పడప్పుడు జరిమానాలు కూడా తప్పడం లేదు. రాష్ట్రాలలో గవర్నర్లను రాజకీయంగా ఆయుధాలుగా మార్చడం పెడరలిజానికి మరో పెద్ద విఘాతం.
అసెంబ్లీలు ఆమోదించిన, కేబినెట్ సిఫార్సు చేసిన బిల్లులను గవర్నర్లు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి నిర్ణయించకుండా పెండింగ్‌లో పెట్టడం నిత్యకృత్యంగా మారింది. తమిళనాడులో దాదాపు పది బిల్లులను గవర్నర్ మూడేళ్లపాటు ఆమోదించకుండా తొక్కిపెట్టారు.సుప్రీంకోర్టు బలవంతం చేస్తూ నిర్ణయం తీసుకునే వరకూ ఈ ఉదంతం సాగింది. పంజాబ్ గవర్నర్ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు నిరాకరించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రలలోనూ గవర్నర్లు వ్యవహరించిన తీరువల్ల దీర్ఘకాలిక ప్రతిష్టంభనలు తప్పలేదు. గవర్నర్లు తమ ఇష్టానుసారం బిల్లులను రాష్ట్రపతికి రిజర్వు చేసుకోవచ్చునని ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు బొమ్మై కేసులో తీర్పు సందర్భంగా మూసివేసిన అధికార దుర్వినియోగం తలుపులు తిరిగి తెరిచినట్లు కనిపిస్తోంది.
ఇక కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు చెప్పనవసరం లేదు. కేంద్రంతో ఘర్షణకు దిగే ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులపై తలచినంతనే.. అన్నట్లు దాడులు చేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్ట్‌లు, మనీష్ సిసోడియా, సత్యేంత్ర జైన్ వంటి వారిని సుదీర్ఘకాలం పాటు జైలులో ఉంచడంతో.. అసమ్మతిని సహించరని, దానిని నేరంగా పరిగణించే వాతావరణం ఏర్పడిందని తేటతెల్లమైంది. రాష్ట్రాల అనుమతి లేకుండా కేంద్రం ఐఎఎస్ లేదా ఐపిఎస్ అధికారులను రీకాల్ చేయడానికి వీలు కల్పించే అఖిల భారత సర్వీస్ నిబంధనల మార్పు ప్రతిపాదన పాలనా యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వం పట్టును మరింత బలోపేతం చేస్తుంది. ఒకప్పుడు ఫెడరల్ వ్యవస్థకు కాపలాదారుగా ఉన్న న్యాయవ్యవస్థ ఇప్పుడు ఈ దిగజారిన పరిస్థితులను అరికట్టేందుకు ఇష్టపడడం లేదు. ఆ విషయంలో న్యాయవ్యవస్థ సామర్థ్యం దశాబ్దాలుగా తగ్గింది. ఒకప్పుడు ఎస్‌ఆర్ బొమ్మై, రామేశ్వర్ ప్రసాద్ వంటి కేసుల్లో బలమైన తీర్పులు, 2018 ఎన్‌సిటీ ఢిల్లీ తీర్పు కేంద్రం అధికారాలను మితిమీరి వినియోగానికి వ్యతిరేకంగా బలమైన రక్షణ కవచాలు అందించాయి. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టు స్వరం మారిపోయింది. ఆర్టికల్ 370పై జరిగిన విచారణలు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణను సమర్థించే మొగ్గును సూచిస్తున్నాయి. ఢిల్లీ సర్వీసుల తీర్పు, తమిళనాడు గవర్నర్ కేసులోని పరిశీలనలు, బొమ్మై తీర్పునకు ముందు శకాన్ని గుర్తుచేసే విసృ్తత కేంద్ర ఆధిపత్య సిద్ధాంతాన్ని పునరుజ్జీవింప జేస్తున్నాయి. అనంతమైన స్థితిస్థాపకత అనే భావన ఒక హెచ్చరికగా కాక, రాజ్యాంగ వాస్తవికతగా మారే ప్రమాదం ఉంది.
భారతదేశపు ఫెడరల్ వ్యవస్థ ఒక రాజీ. ఓ గిఫ్ట్ కాదు. నెహ్రూ, పటేల్ వంటి కేంద్రీకరణ వాదులు, మద్రాస్, బెంగాల్, ఇతర రాచరిక రాష్ట్రాలనుంచి బలమైన ప్రాంతాల స్వరాల మధ్య జరిగిన చర్చలలో ఆవిర్భవించి వ్యవస్థ. రాజకీయ చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే, కేంద్రానికి రాష్టాలు అవసరమైనప్పుడు లేదా రాష్ట్రాలపై ఆధారపడాల్సి న పరిస్థితి తలెత్తినప్పుడే సమాఖ్యపరమైన సమతుల్యతలు పునరుద్ధరించబడతాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, ఫెడరల్ వ్యవస్థను ఎవరు కాపాడతారు? ఏ జాతీయ పార్టీ కూడా నిజంగా ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి కొనసాగాలని కోరుకోవడం లేదని రికార్డులు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం పెత్తనం కేంద్రీకృతమైంది. ప్రస్తుతం బిజెపి మరింత ఆత్యాధునికంగా రాజకీయ క్రమశిక్షణతో పెత్తనాన్ని కేంద్రీకృతం చేసుకుంటున్నది. ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడే ఫెడరలిజాన్ని సమర్థిస్తాయి. ఇక పౌర సమాజం మీడియా సమాఖ్యవాదాన్ని సంక్షేమ పంపిణీ, పోలీసింగ్, స్కూళ్లలో పాఠ్యాంశాలు, మార్కెట్ వ్యవస్థలు, సాంసృ్కతిక హక్కుగా కాక, రాజ్యాంగ ఆలోచనగా పరిగణిస్తాయి. సమాఖ్య విధానం మనుగడ సాధించాలంటే, సాధారణ పౌరులే శ్రద్ధ వహించాలి.
తమిళులు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి ఎంత విలువ ఇస్తారో, ఉత్తరప్రదేశ్ లోని ఓటర్లు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి అంతే విలువ ఇవ్వాలి. కేంద్రం రూపొందించిన వ్యవసాయ విధానం తమ అవసరాలను ప్రతిబింబించకపోవచ్చునని బీహార్ రైతులు గ్రహించాలి. అసోం వాసులు తమ సంసృ్కతి, భూమి, భాష, విద్యపై స్థానిక నియంత్రణ కేంద్రం ఇస్తున్న తాయిలం కాదనీ, రాజ్యాంగబద్ధమైన హక్కు అని అర్థం చేసుకోవాలి. భారతదేశం నేడు ఒక కీలకమైన దశలో ఉంది. మనం కో ఆపరేటివ్ ఫెడరలిజం నుంచి సమ్మతితో కూడిన సమాఖ్యవాదానికి మారాం. మనం కేంద్రం లాగుతున్న వైపు కదులుతున్నాం. న్యాయవ్యవస్థ అనంత స్థితి స్థాపకత వంటి సిద్ధాంతంతో కేంద్రానికి తోడ్పడుతోంది. అందరికీ ఆమోదయోగ్యమైన ఫెడరల్ వ్యవస్థ పరిఢవిల్లాలని రాజ్యాంగ సభ కోరింది. అదే సమయంలో సభ వ్యక్తం చేసిన ఆందోళననే జస్టిస్ మెహతా హెచ్చరిక ప్రతిధ్వనిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ సంపూర్ణ నియంత్రణనే కోరుకుంటున్నప్పుడు.. పిల్లి మెడ లో గంటకట్టేది ఎవరు? భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ వ్యవస్థపై సమాధానం బాధాకరంగానే కన్పిస్తోంది. కేంద్రం దీనిని పట్టించుకోవడం లేదు. ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాలంటే, దానిని సుప్రీంకోర్టో, రాష్ట్ర అసెంబ్లీలు మాత్రమే కాదు 140 కోట్ల మంది ప్రజల రాజకీయ చైతన్యం తోడవ్వాలి.
– గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు