9.90 ఎకరాలకు రూ.1,350 కోట్ల ఆదాయం
హెచ్‌ఎండిఎ ఇవేలానికి భారీ స్పందన
28న రెండో విడత వేలానికి ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియో పోలీస్ లే ఔట్1లోని రెండు ప్లాట్లకు ప్రభుత్వం సోమవారం ఈ-వేలం నిర్వహించింది. ఈ- వేలంలో ప్లాట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం విశేషం. కోకాపేటలో ఎకరం ధర 137.25 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 17, 18లకు సోమవారం అధికారులు ఈ వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి 136.50 కోట్ల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరా లు ఉండగా ఈ వేలంలో ఎకరానికి 137.25 కోట్ల ధర పలకడం గమనార్హం. సోమవారం జరిగిన ఈ వేలంలో 9.90 ఎకరాల వేలానికి గాను రూ. 1,356 కోట్ల ఆదాయం హెచ్‌ఎండిఏకు రావడం విశేషం.
కాగా, అంతర్జాతీయ సంస్థలు, భారీ నిర్మాణ దారులను దృష్టిలో ఉంచుకొని హెచ్‌ఎండిఏ ఈ వేలం నిర్వహించింది. గతంలో కోకాపేట్‌లో ఎకరం రూ.100 కోట్ల వరకు వేలం వేయగా, ఈసారి కూడా దానికి మించి ధర పలకడం విశేషం. అంతర్జాతీయ హంగులతో ఈ లే ఔట్ ఉండగా మరోవైపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓఆర్‌ఆర్, మరోవైపు రాయదుర్గం ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉండడంతో నియో పోలీస్ లే ఔట్lలో భూముల ధరలకు రెక్కలొచ్చాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఒక్కో ఎకరానికి రూ.99 కోట్ల ప్రారంభ ధర
కోకాపేట నియోపోలీస్1లో ఒక్కో ఎకరానికి రూ.99 కోట్ల ప్రారంభ ధరను హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. ఈనెల 28వ తేదీన, డిసెంబర్ 3, (నియోపోలీస్1లో) 5వ తేదీన (గోల్డెన్‌మైన్‌లో) మిగతా ప్లాట్లకు హెచ్‌ఎండిఏ ఈ వేలం నిర్వహించనుంది. కోకాపేట్ నియోపోలీస్ ప్లాట్లకు ఎకరానికి రూ.99 కోట్లు, కోకాపేట గోల్డెన్ మైల్ ప్లాట్లకు రూ.70 కోట్లు, మూసాపేట్ ప్లాట్లకు రూ.75 కోట్ల చొప్పున ప్రారంభ ధరను హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. కోకాపేటలోని నియోపోలీస్ లే ఔట్‌లో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ఎన్ని అంతస్థులైనా నిర్మించుకునేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. ఈ లే ఔట్‌లో ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. దాదాపు రూ.300 కోట్లతో ఈ లే ఔట్‌లో అభివృద్ధి పనులు చేపట్టారు. 40 ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇందులో సైక్లింగ్, 45 మీ.ల వెడల్పు రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలను కల్పించారు. అలాగే కమర్షియల్, రెసిడెన్సీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ల అవసరాలకు భవనాలు నిర్మించుకునేందుకు అనుమతించనున్నారు. అంతర్జాతీయ సంస్థలు, భారీ నిర్మాణ దారులను దృష్టిలో ఉంచుకొని హెచ్‌ఎండిఏ ఈ వేలం నిర్వహించింది.
ఒక్కో ప్లాట్ 1.98 ఎకరాల నుంచి 5.31 ఎకరాలు
ఒక్కో ప్లాట్ 1.98 ఎకరాల నుంచి 5.31 ఎకరాల వరకు ఉంది. 2023లో కోకాపేటలో భూములను వేలం వేయగా ఎకరానికి 100.75 కోట్లు పలికింది. ఈసారి కూడా దానికి మించి ధర పలకడం విశేషం. తాజా వేలానికి బిడ్డింగ్‌లోనే ప్రభుత్వం నిర్ణయించిన ధర కోకాపేటలో ఎకరానికి రూ.99 కోట్లు కాగా, గోల్డెన్‌మైన్‌లో లే ఔట్‌లో రూ.70 కోట్లు, మూసాపేటలో రూ.75 కోట్లుగా నిర్ణయించారు. ఈ ప్లాట్ల వేలం ద్వారా దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని హెచ్‌ఎండిఏ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం జరిగిన వేలంలో 10 మంది ప్రముఖ జాతీయ, స్థానిక డెవలపర్లు పోటీ పడ్డారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ వేలం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.