ముసాయిదా దశలోనే ఉత్తర్వుల్లోని సమాచారం బయటికి పొక్కడంపై ప్రభుత్వం ఆగ్రహం
లీకు వీరులపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా
వివిధ శాఖల యూజర్ ఐడిలు, పాస్‌వర్డ్‌లు మార్పు
ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
భూముల కేటాయింపుపై ఇటీవల కెటిఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కలకలం
మన తెలంగాణ/హైదరాబాద్: సచివాలయంలో డ్రాఫ్ట్ దశలోనే ఉత్తర్వులు మాయమవుతుండటం, అవి కాస్తా బిఆర్‌ఎస్ ఆఫీసుకు చేరుతుండటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సమగ్ర విచారణ కు ప్రభుత్వం ఆదేశించింది. సమాచారాన్ని లీక్ చేస్తున్నదెవరు? జీఓ బయటకు రాకముందే ఎక్కడి నుంచి ఈ సమాచారం బయటకు వెళుతుందన్న అంశాలపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించిన యూజర్ ఐడిలను, పాస్‌వర్డ్‌లను మార్చివేసింది. దీంతోపాటు ప్రభు త్వం తీసుకునే నిర్ణయాలు, డ్రాప్ట్‌లు, జిఓలు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించే వరకు బ యటకు రాకూడదని ఒకవేళ వస్తే ఆ శాఖ ఉన్నతాధికారులనే బాధ్యులను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఆ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వం అన్ని విభాగాల ఇన్‌చార్జీలను ఆదేశించింది. దీంతో రానున్న రోజుల్లో ఆయా విభాగాలు తీసుకునే నిర్ణయాలు, మంత్రిమండలి ఆమోదాలు, జిఓలు తదితర విషయాల ను లీక్ చేయకుండా పటిష్టమైన చర్యలను చేపట్టాలని ప్రభుత్వం అన్ని శాఖల ఉన్నతాధికారులకు సూచించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని ప్ర భుత్వం హెచ్చరించింది. ఇటీవల భూముల కే టాయింపు అంశంపై మాజీ మంత్రి కెటిఆర్ ప్రెస్‌మీట్ పెట్టి హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ పాలసీ వెనుక రూ.5లక్షల కోట్ల భూ కుంభకోణం ఉందని ఆరోపించారు.
కెటిఆర్ ఆరోపణలపై ప్రెస్ మీట్ పెట్టిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బిఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన జీఓనే తాము ఫాలో అవుతున్నామని క్లారిటీ ఇచ్చారు. తాము ఇంకా అలాంటి జీఓనే ఇవ్వలేదంటూ వివరణ ఇచ్చారు. మీరు జీఓ ఇవ్వకుండానే బిఆర్‌ఎస్ పార్టీకి ఎలా చేరిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన దాట వేశారు. ఈ క్రమంలోనే ఇంటిదొంగలెవరో తేల్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇలా ప్రతిపక్షానికి ఎలాంటి సమాచారం లీకవుతోంది..? డ్రాఫ్ట్ దశలో ఉన్న జీఓలు ఎలా బయటకు వెళ్తున్నాయన్న అంశంపై ఆరా తీసే పనిలో ఇంటెలిజెన్స్ నిమగ్నమైనట్టుగా తెలిసింది.