ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము
హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గైర్హాజరు
తొలి రోజే 17 కేసులు విచారించిన జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ : భారత దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోజరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదివారం నాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్‌సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రత్యేకహోదా రద్దు కావడం, బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష తదితర అనేక చారిత్రక తీర్పులు వెలువరించిన ఘనత సాధించుకున్న సూర్యకాంత్ తదుపరి సిజేఐ గా అక్టోబర్ 30న నియామకమయ్యారు. ఈ పదవిలో దాదాపు 15 నెలల పాటు తన వయస్సు 65 ఏళ్లు పూర్తయ్యేవరకు 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోడీ, తదితర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రమాణస్వీకార కార్యక్రమం ఫోటోలను ప్రధాని మోడీ తన ఎక్స్ పోస్ట్‌లో షేర్ చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ కూడా కార్యక్రమంలో పాల్గొని కొత్త సిజెఐ కి అభినందనలు తెలిపారు. ఆదివారం బాధ్యతలనుంచి వైదొలగిన జస్టిస్ గవాయ్ కొత్త సిజెఐని ప్రేమాభిమానాలతో హత్తుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో తొలిసారిగా భూటాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్,శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్‌లు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావడం విశేషం. జస్టిస్ సూర్యకాంత్1962 ఫిబ్రవరి 10న హర్యానా లోని హిసార్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.
1984లో రోహ్‌తక్ లోని మహర్షి దయానంద్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా, హైకోర్టు న్యాయవాదిగా నియమితులయ్యారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. వివిధ ధర్మాసనాల్లో పలు కీలక తీర్పుల్లో ఆయన భాగమయ్యారు. 370 వ అధికరణను రద్దు చేయడం, స్వేచ్ఛగా భావ ప్రకటన, పౌరసత్వం హక్కులు కల్పిస్తూ తీర్పులు వెలువరించారు. కొత్తచట్టం వచ్చేవరకు వలసవాద దేశద్రోహ చట్టం కింద ఎలాంటి కేసులు దాఖలు కాకుండా ఆపివేయించారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణలో తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలను వెల్లడించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు.
తొలిరోజు 17 కేసుల విచారణ
ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజు సోమవారమే సిజెఐ సూర్యకాంత్ 17 కేసులు విచారించారు. అదే విధంగా ఓ కొత్త విధానపరమైన నియమాన్ని తీసుకొచ్చారు. ఇకపై అర్జెంట్ లిస్టింగ్ కేసులను తప్పనిసరిగా లిఖిత పూర్వకంగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం వంటి అసాధారణ పరిస్థితుల్లోనే మౌఖిక అభ్యర్థనలను అనుమతించనున్నట్టు చెప్పారు.
రాహుల్ గైరుహాజరు సిగ్గుచేటు: బీజేపీ ఆగ్రహం
నూతన ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ప్రమాణస్వీకారానికి లోక్‌సభ విపక్షనేత రాహుల్ గాంధీ హాజరు కాకపోవడంపై బీజేపీ మండిపడింది. హర్యానా రాష్ట్రం వేడుక చేసుకుంటోంద ని, మోడీ, రాష్ట్రపతి ముర్ము తదితర అగ్రనేతలు హా జరు కాగా, విపక్షనేత హాజరుకాకపోవడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌పూనావాలా విమర్శించారు.