అనారోగ్యంతో తుదిశ్వాస
300కు పైగా సినిమాల్లో నటన
రొమాంటిక్ హీరో, యాక్షన్ కింగ్‌గా స్టార్‌డమ్ ఆయన సొంతం
పద్మభూషణ్ సహా పలు అవార్డులతో సత్కరించిన ప్రభుత్వాలు
రాష్ట్రపతి, ప్రధాని, బాలీవుడ్ ప్రముఖుల నివాళి
ముంబై: బాలీవుడ్ వీరూ, హీమాన్ పేరే బ్రాండ్‌గా నిలిచిన స్టార్ హీరో ధర్మేంద్ర(89) సోమవారం కన్నుమూశారు. మూడు తరాల సుదీర్ఘ యాక్షన్ జీవితంతో 65 ఏం డ్లుగా హీరోగా చలామణి అయిన ధర్మేంద్ర 300కు పైగా సినిమాల లో నటించారు. తనకు అంటూ ధీ రోదాత్త, చలాకీ తనపు ప్రత్యేకతను సంతరించుకున్నారు. కొంతకాలం గా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ధర్మేంద్ర ఉదయం మృతి చెందారని ముంబై పోలీసు వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. వచ్చే నెల 8న ధర్మేంద్ర 90వ వసంతంలోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఈ లోగానే ఆయన మరణించారు. చాలా రోజులుగా ధర్మేంద్ర అనారోగ్యంపై పుకార్లు వెల్లువెత్తాయి. కొద్దిరోజుల క్రితమే ఆయన చనిపోయినట్లు ప్రచారం జరిగినా కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ధర్మేంద్రను ముంబైలోని జుహూ ప్రాంతంలోని ఆయన నివాసానికి చేర్చారు.
కొద్ది రోజులుగా ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. ఆయన అంత్యక్రియలను సోమవారం సాయంత్రం అభిమానులు, బాలీవుడ్ ప్రముఖుల అంతిమ నివాళి నడుమ ఇక్కడి విలే పార్లేలోని శ్మశాన వాటికలో నిర్వహించారు. ఇందుకు ఏర్పాట్లు జరిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం నుంచే జుహూలోని ధర్మేంద్ర నివాసానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. భార్య హేమామాలిని, కూతురు ఈషా డియోల్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తదితరులు అంత్యక్రియలకు తరలివచ్చారు.
ధర్మేంద్ర జీ మృతితో భారతీయ సినిమా చరిత్రలో ఓ అధ్యాయం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోడీ తరఫున ప్రకటన వెలువడింది. ఆయన సినీ దిగ్గజం, ప్రతి పాత్రపై తన ప్రత్యేక ముద్ర వేశారు. అసంఖ్యాక జనం అభిమానం పొందారు. సినిమాకు ఆకర్షణ తీసుకురాడం ఆయన ఘనత అని ధర్మేంద్రకు మోడీ నివాళులు అర్పించారు. నిరాడంబరత , అందరిని ఆదరించడం, ప్రేమ ఆయన వ్యక్తిత్వం. ఈ దశలో ఆయన లోటును అనుభవించే కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. సత్యకామ్ సినిమాతో ఆరంభం అయిన ధర్మేంద్ర హీరోయిజం షోలే వరకూ అంతకు మించి కూడా సాగింది. అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి స్క్రిప్ట్ రైటర్ సలీం ఖాన్ , హీరోలు అమీర్ ఖాన్, సెలబ్రిటిలు కరణ్ జోహార్, కాజోల్, అజయ్ దేవగన్, కరీనా కపూర్ వంటి వారు ధర్మేంద్ర కు నివాళులు అర్పించారు. ధర్మేంద్ర బాపు అని స్పందించారు.
సినిమా చరిత్రలో ఓ పుట తిరిగిందని పలువురు వ్యాఖ్యానించారు. అవిభక్త పంజాబ్‌లోని లూథియానా జిల్లా నస్రైల్ గ్రామంలో జన్మించారు. తండ్రి స్కూల్ టీచరు . బదిలీవల్ల ధర్మేంద్ర బాల్యం ఎక్కువగా అక్కడికి దగ్గరిలోని సహ్నేవాల్‌లో జరిగింది. ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్‌సింగ్ కేవల్ కోషన్ డియోల్. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. ప్రకాశ్ కౌర్, సినిమా హీరోయిన్ హేమామాలిని ఆయన వివాహమాడారు. ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఇద్దరూ పేరు మోసిన హీరోలే, కూతుళ్లు విజేత, అజీత, ఈషా, అహ్న డియోల్. వీరిలో ఈషా డియోల్ హీరోయిన్‌గా రాణించారు. ధర్మేంద్ర 2012లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. లివింగ్ లెజెండ్‌తో పాటు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాలు ఆయనను వరించాయి. ఫాల్కేరత్న అవార్డు కూడా ధర్మేంద్ర సొంతమైంది.