ఉప ఎన్నిక సమయంలో కార్పొరేటర్లు అద్భుతంగా పోరాడారు
జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశంలో భూముల అమ్మకంపై నిలదీయాలి
బిఆర్‌ఎస్ కార్పొరేటర్లకు కెటిఆర్ దిశానిర్దేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత నగరంలో ఉన్న కార్పోరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందించారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ కార్పోరేటర్లందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జిహెచ్‌ఎంసి పరిధిలోని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, కార్పొరేటర్లతో కెటిఆర్ సమావేశమయ్యారు.
బల్దియా సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు కెటిఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ కార్పొరేటర్లకు వివిధ అంశాలపైన మార్గదర్శనం చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఎలాంటి అవినీతికి తావులేకుండా పనిచేశారని, కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతంగా సేవలందించారని ప్రశంసించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కార్పొరేటర్లు అద్భుతంగా పోరాడారని అభినందించారు. పరిశ్రమలకు కేటాయించిన వాటితో పాటు హైదరాబాద్‌లో భూముల అమ్మకంపై జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశంలో నిలదీయాలని కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం వైఫల్యంపై నిలదీయాలని సూచించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ అందరినీ గెలిపించుకుంటుందని వారికి కెటిఆర్ భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లకి రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందని కెటిఆర్ తెలిపారు. ఈనెల 29వ తేదీన జరగనున్న దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని కెటిఆర్ కోరారు.
దీక్ష దివాస్ సంబరాలకు సంబంధించి నగరంలో ఏర్పాట్లపై మాజీమంత్రి, ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రయత్నాలు జరిగినా, కెసిఆర్ దీక్ష తర్వాతనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. ఇంతటి గొప్ప ఘట్టాన్ని ప్రజలందరికీ మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఆ దిశగా ఈనెల 29వ తేదీన నగరంలో భారీగా దీక్ష దివాస్‌ను నిర్వహించనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి, జిహెచ్‌ఎంసి పరిధిలోని ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.