గౌహటి: బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఈ రోజు కూడా సఫారీలదే ఆధిపత్యం కొనసాగింది. సఫారీ బౌలర్ల దెబ్బకి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. మూడో రోజు 9/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు యశస్వీ జైస్వాల్, కెఎల్ రాహుల్‌ల జోడీ మంచి ఆరంభాన్నే ఇచ్చింది. తొలి వికెట్‌కి వీరిద్దరు కలిసి 65 పరుగులు జత చేశారు. కానీ, కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో రాహుల్(22) ఔట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత అర్థ శతకం పూర్తి చేసుకున్న జైస్వాల్(58) హార్మర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
95 పరుగుల వద్ద కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్ ఆ తర్వాత ఒక్కొక్కటిగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. సాయి సుదర్శన్ (15), జురేల్(0), పంత్ (7), జడేజా (6), నితీశ్ (10) ఘోరంగా విఫలమయ్యారు. ఈ దశలో వాషింగ్టన్ సుందర్(48, 92 బంతుల్లో), కుల్దీప్ యాదవ్(19, 134 బంతుల్లో)తో కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. 122 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో స్కోర్ బోర్డును 194 పరుగుల వరకూ తీసుకొచ్చారు. కానీ, సుందర్‌ని హార్మర్ పెవిలియన్‌కు పంపాడు. ఆ వెంటనే యాన్సెన్ బౌలింగ్‌లో కుల్దీప్ కూడా ఔట్ అయ్యాడు. చివరకు బుమ్రాను యాన్సెన్ ఔట్ చేయడంతో భారత్ 201 పరుగుల వద్ద అలౌట్ అయింది. సఫారీల బౌలింగ్‌లో యాన్సెన్ 6, హార్మర్ 3, మహరాజ్ 1 వికెట్ తీశారు. అయితే సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా తామే బ్యాటింగ్ చేసేందుకు ముందుకు రావడంతో భారత్ ఫాలో ఆన్ నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసి 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.