మూడో తరగతి పిల్లలు తమ అభిమాన రచయితను, చిత్రకారుడిని నేరుగా కలవడం, వారిని ప్రశ్నలడగడం.. ఇలాంటివి మీరు ఎ ప్పుడైనా విన్నారా? నేను మొదటిసారి విని ఆశ్చర్యపోయాను. నిజానికి, నా ఆశ్చర్యం ఆగస్టు నెలలో మొదలైంది. ఆస్ట్రేలియాలో మూడో తరగతి చదువుతున్న నా మనవరాలు, తన బడి నుండి తోటి పిల్లలతో కలిసి అభిమాన రచయిత ను కలిశానని ఉత్సాహంగా చె ప్పినప్పుడు ఆ అద్భుతాన్ని తెలుసుకున్నాను. ప్రాథమిక పాఠశా ల విద్యార్థులు ఇంత చిన్న వయసులోనే ఒక రచయితతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొని, తమ సందేహాలను అడగడం, అది ఆ దేశంలో సాధారణ విషయం కావడం కావచ్చు కానీ, నన్ను ఈ విషయం ఎంతగానో ఆలోచింపజేసింది. కేవలం ఐదేళ్ల పిల్లల నుంచి అందరికీ ఆ దేశం లో ఇలాంటి అవకాశం ఉంటుందని మా అమ్మాయి చెప్పింది. ఆస్ట్రేలియాలో బాలసాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తారని తెలుసు కానీ, రచయితతో ముచ్చట్లు, కథల సంభాషణలు ఇంత సహజంగా ఉంటాయని ఊహించలేదు. అందుకే, ఆస్ట్రేలియన్ బాల సాహిత్యంపై నేను తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
బాలల లోకంలో పుస్తకాల పలకరింపు : ఆస్ట్రేలియాలో బాల సాహిత్యాన్ని పిల్లలకు చాలా చిన్న వయసు నుంచే, అంటే పుట్టినప్పటి నుంచే పరిచయం చేస్తారు. పిల్లలకి నెలలోపే పుస్తకాలు చూపించడం చూశాను. బిడ్డ పుట్టినప్పటి నుంచి చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు బోర్డు పుస్తకా లు, బొమ్మల పుస్తకాలు చదివి వినిపించడం ప్రారంభిస్తారు. పిల్లలు సైతం బొమ్మల కథల పుస్తకాలను చూసి ఊహల్లోకి వెళ్తారు. అందులో లీనమైపోతారు. కథ వింటూనో, బొమ్మలు చూస్తూనో నవ్వుతారు, భయపడతారు, దుఃఖపడతారు. ఇలా కథల నుంచి పిల్లలు అనేక జీవిత పాఠాలు నేర్చుకుంటారు. ముఖ్యంగా వారి భాషా సామర్థ్యం పెరుగుతుంది.
ఆస్ట్రేలియాలో బాల సాహిత్యం విస్తృత శ్రేణిలో పిల్లల వయసు, వారి అభ్యసన స్థాయి, ఆసక్తిని బట్టి భిన్న రూపాల్లో అందుబాటులో ఉంది. మూ డేళ్ళ లోపు పిల్లలకి బోర్డు పుస్తకాలు ఉంటాయి. అవి మందపాటి పేజీలు, తక్కువ పదాలు, ఎక్కువ బొమ్మలతో ఉండి అక్షరాలు, సంఖ్యలు, రంగులు, పదజాలం, శబ్ద జ్ఞానం ఇస్తాయి. రెండు నుండి ఆ రేళ్ళ పిల్లలకి బొమ్మల పుస్తకాలు చిన్న చిన్న పదా లు, వాక్యాలు, బొమ్మలతో ఉంటాయి. ఆ బొమ్మ లు కథకు అర్థాన్ని, బలాన్ని ఇస్తాయి. ‘పాప్-అప్, టచ్ అండ్ ఫీల్’ పుస్తకాలు కూడా ఈ కోవలోనివే. ఐదు నుండి ఎనిమిదేళ్ళ వయసు పిల్లలకు చిన్న అధ్యాయాల పుస్తకాలు ఉంటాయి. అవి పిల్లలు సొంతంగా చదవగలిగేలా, సరళమైన కథాంశాలతో, చిన్న చిన్న అధ్యాయాలతో ఉంటాయి.
ఎనిమిది నుండి పన్నెండేళ్ళ మధ్య వయసు పిల్లల కు సాహసం, ఫాంటసీ, ఆస్ట్రేలియా పట్టణాలు నగరాల నేపథ్యంలో తీరప్రాంతాలు, ప్రకృతి, జంతువు లు, ప్రజల సంస్కృతి, వారి నిజ జీవితాల్లో కనిపిం చే అనేక అంశాలు, భావోద్వేగాలతో కూడిన వాస్త వ కథలు ఉంటాయి. అలాగే హాస్యం, చారిత్రక, గ్రాఫిక్ కథలు, కామిక్స్ ఎక్కువగా ఉంటాయి. పదమూడేళ్ల పిల్లలకు అనేక అధ్యాయాలతో కూడిన సుదీర్ఘ నవలలు కూడా ఉంటాయి. కల్పిత కథలు, సాహసాలు, ఫాంటసీ, హాస్యం, చరిత్ర, నిజ జీవిత సమస్యలు, గుర్తింపు, సంఘర్షణ వంటి క్లిష్టమైన ఇతివృత్తాలు కనిపిస్తాయి. చదవడం, రాయడం రాని కిండర్ గార్టెన్ పిల్లలకు కూడా వారి సామర్థ్యా న్ని బట్టి ప్రతి వారం బడి నుండి ఒక పుస్తకం ఇంటికి వస్తుంది. చదువు నేర్చుకునే ఈ తొలి దశలో సరళమైన కథలు, స్నేహం, బడి, పెంపుడు జంతువుల గురించి ఉంటాయి. బాల సాహిత్యం కేవలం వినోదం కాదు, విజ్ఞాన, వికాసాలకు దోహదపడే శక్తివంతమైన సాధనంగా అక్కడ గుర్తింపు పొందింది.
ఆస్ట్రేలియన్ బాలల కథా ప్రపంచం: వైవిధ్యమైన ఇతివృత్తాలు ఆస్ట్రేలియన్ బాల సాహిత్యం వారి దేశం, చరిత్ర, సంస్కృతిని పిల్లల మనసుల్లో బలంగా నాటుతుంది. ఆ కథల్లో కనిపించే ప్రత్యేకతలు కొన్ని చూద్దాం. ప్రకృతి, జంతుజాలం కథల్లో భూమి, భూభాగం, ప్రకృతి, అడవులు, ఎడారులు, తీరప్రాంతాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కోలా, కంగారూలు, ప్లాటిపస్ వంటి ఆస్ట్రేలియాకే ప్రత్యేకమైన జంతువులు పాత్రలుగా కనిపిస్తాయి. పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలు ప్రధాన ఇతివృత్తాలుగా ఉంటాయి. స్థానిక, సాంస్కృతిక వైవిధ్యం అబోరిజినల్స్ అనే మూలవాసీ తెగలు, టోర్రెస్ స్ట్రెయిట్ ఐలాండర్స్ ప్రజల సంస్కృతి, జీవనాన్ని పరిచయం చేసే కథలు చాలా ముఖ్యమైనవి. వారి జానపద కథలు, భూమి చరిత్ర, నైతికత వంటి విభిన్న దృక్పథాలను అందిస్తాయి. వలసవాదం చరిత్ర, విభిన్న సంస్కృతుల మధ్య భేదాలు, వలసదారుల అనుభవాలు కథాంశాలుగా ఉంటాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో కూడిన ఆస్ట్రేలియా సమాజపు వైవిధ్యాన్ని ప్రతిబింబించే కథలు, విభిన్న కుటుంబ నేపథ్యాలు, సంస్కృతులు బాలలకు పరిచయం అవుతాయి.
జీవిత విలువలు: స్నేహం, సాహసం, జట్టుగా కలిసి ఉండడం, సమస్యలకు పరిష్కారం కనుగొనడం, విభిన్న సంస్కృతులు అర్థం చేసుకోవడం వంటి ఉమ్మడి ఆస్ట్రేలియ న్ విలువలు ఆ కథల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. సాహసం, ఫాంటసీతో పాటు ఆస్ట్రేలియా చరిత్రలో ని ముఖ్య సంఘటనలు, సాధారణ జీవితాలు కూడా పిల్లల దృష్టికోణంలో కనిపిస్తాయి. ఆస్ట్రేలియన్ బాల సాహిత్యంలో ప్రత్యేకమైన ఆస్ట్రేలియన్ హాస్యం, చమత్కారం కనిపిస్తుంది. ఆస్ట్రేలియన్ బాల సాహిత్యం కేవలం వినోదం అందించడమే కాకుండా, మాతృభూమి, స్వదేశీ సంస్కృతి, విభిన్న సంస్కృతుల సమాజం, వలసవాద చరిత్ర గురించి తెలుసుకోవడానికి కిటికీలు తెరిచి ఉంచింది. చిన్నతనం నుంచే చదవడం అలవాటు చేసి, ఆ కథల ద్వారా పిల్లల్లో దేశంపైనా, ఇతరులపైనా బలమైన అనుబంధాన్ని పెంచుతున్న తీరు నిజంగా మనం నేర్చుకోదగిన విషయం.
– వి.శాంతి ప్రబోధ