అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైసిపి కార్యకర్తలుపై టిడిపి శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. టిడిపి రాష్ట్ర యువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబు ఆరోపణలపై వైసిపి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, అనుచరులు స్పందించారు. మెడికల్ కళాశాల అభివృద్ధి పనులపై చర్చకు రావాలని ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు సవాల్ విసిరారు. మదనపల్లి మెడికల్ కాలేజీ వద్ద వైసిపి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టిడిపి, వైసిపి కార్యకర్తలు దాడులకు దిగారు. తమపై టిడిపి కార్యకర్తలు దాడులు చేశారని వైసిపి నాయకులు ఆరోపణలు చేశారు. వైసిపి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంఎల్ఎ మిథున్ రెడ్డి, ఎంఎల్ఎ ద్వారకనాథ్ పై శ్రీరామ్ చినబాబు ఆరోపణలు చేయడం సరికాదని వైసిపి నాయకులు మండిపడ్డారు. పోలీసులతో తమను ఆపే ప్రయత్నం చేస్తున్నారని వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి హయాంలో అవినీతి పాల్పడకుండా మెడికల్ కాలేజీలు నిర్మించామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.