మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల సమరానికి ముందు కాంగ్రెస్ పార్టీలో కుంపటి మొదలైంది. పార్టీ అధిష్టానం ఎంతో ఆచి-తూచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు (డిసిసి)ల ఎంపిక చేపట్టినప్పటికీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తులు, గందరగోళానికి దారి తీసింది. జోడు పదవులు ఉండరాదంటూనే ఐదుగురు ఎంఎల్‌ఏలకు, ఒక ఎంఎల్‌ఏ భార్యకూ, ఇరువురు కార్పొరేషన్ల చైర్మన్లకూ డిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్డడంతో అసంతృప్తి జ్వాల ఎగిసి పడింది. పైగా పార్టీలో చాలా జూనియర్లకు, స్థానికంగా గుర్తింపు లేని వారికీ పదవి కట్టబెట్టడంతో పార్టీలో కలకలం చెలరేగింది. డిసిసి అధ్యక్ష పదవుల ఎంపిక పారదర్శకంగా నిర్వహిస్తామని, పైరవీలు చేయరాదని పార్టీ పరిశీలకులు మొదటి నుంచి మీడియా ద్వారా చెబుతున్నా, చివరకు పైరవీలు చేసిన వారికే పట్టం కట్టారంటూ అనేక జిల్లాల్లో నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అధ్యక్ష పదవి ఎంపికలో తీవ్ర పోటీ, వివాదస్పదమైన రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల డిసిసి ఎంపిక ప్రక్రియను పెండింగ్‌లో పెట్టారు. ఇదిలాఉండగా పలు జిల్లాల్లో నాయకుల విమర్శలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిస్పందిస్తూ బిసిలకు పెద్ద పీట వేశామని, అన్ని వర్గాలకూ సముచిత న్యాయం కల్పించామని వివరించారు.
సిఎం నా గొంతు కోశారు: నల్లగొండలో గుమ్ముల
నల్లగొండ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అనుచరుడు గుమ్మున మోహన్ రెడ్డి డిసిసి అధ్యక్ష పదవి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గొంతు కోశారని ఆయన ఆక్రోశంగా అన్నారు. పార్టీ కోసం తన నిబద్ధత, సేవలను పట్టించుకోకుండా కేవలం మంత్రి కోమటిరెడ్డి అనుచరున్ని అనే మిషతో తనకు పదవి ఇవ్వలేదని ఆయన భగ్గుమన్నారు. వలస వచ్చిన వారినే అందలం ఎక్కిస్తున్నారని గుమ్ముల మోహన్ రెడ్డి మండిపడ్డారు.
యాదాద్రిలో ఒక్కరికే మూడు పదవులా?
యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని బీర్ల ఐలయ్యకు అప్పగించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా ఉన్నారని, ఇప్పుడు డిసిసి అధ్యక్ష పదవి కూడా కట్టబెడితే నలభై ఏళ్ళుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తమ సంగతేమిటని డిసిసి అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన సోత్నక్ ప్రమోద్ కుమార్ ప్రశ్నించారు. తన నిబద్ధతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి ప్రత్యామ్నాయంగా ఏదైనా పదవి ఇస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కామారెడ్డిలో నేతల కస్సు-బుస్సు
కామారెడ్డి డిసిసి అధ్యక్ష ఎంపికలోనూ తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు డబ్బు-జబ్బు పట్టిందని స్థానిక నాయకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మల్లిఖార్జున్‌కు డిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టారని, సదరు వ్యక్తికి నాయకునిగా గుర్తింపు లేదని కాంట్రాక్టర్‌గానే గుర్తింపు ఉందని మండిపడుతున్నారు.
ఎంఎల్‌ఏలకు డిసిసి పీఠం
ఇదిలాఉండగా ఐదుగురు ఎంఎల్‌ఏలకు డిసిసి అధ్యక్ష పదవులు కట్టబెట్టారు. కరీంనగర్‌ః చొప్పదండి ఎంఎల్‌ఏ మేడిపల్లి సత్యం, పెద్దపల్లి ః రామగుండం ఎంఎల్‌ఏ రాజ్ ఠాకూర్, నిర్మల్ ః ఖానాపూర్ ఎంఎల్‌ఏ వెడ్మ బొజ్జు, నాగర్ కర్నూలుః అచ్చంపేట ఎంఎల్‌ఏ వంశీ కృష్ణ
యాదాద్రి భువనగిరి:
ఆలేరు ఎంఎల్‌ఏ బీర్ల ఐలయ్య
క్రిస్టియన్, ఆర్థిక సంస్థ చైర్మన్ కె. దీపక్ జాన్‌ను సికింద్రాబాద్‌కు, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివ సేనా రెడ్డిని వనపర్తి డిసిసి అధ్యక్షునిగా నియమించారు. ఇకపోతే మొత్తం ముప్పై ఆరు మంది డిసిసి అధ్యక్షుల్లో ఐదుగురు మహిళలకు డిసిసి పీఠం దక్కింది. సిద్దిపేటః అంక్షారెడ్డి, కుమురంబీం అసిఫాబాద్‌ః ఆత్రం సుగుణ, భద్రాద్రిః తోటి దేవి ప్రసన్న, జనగామః లకావత్ ధన్వంతి, మహబూబాబాద్‌ః భూక్యా ఉమ. ఇదిలాఉండగా ప్రస్తుతం సిద్దిపేట డిసిసి అధ్యక్షునిగా ఉన్న నర్సారెడ్డి కుమార్తె అంక్షా రెడ్డికి డిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడం పట్ల కొంత మంది స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ డిసిసిలు ఎందుకు ఆగినట్లు ?
సంగారెడ్డి డిసిసి అధ్యక్ష పదవి నిర్మలా జగ్గారెడ్డికే ద క్కుతుందన్న ప్రచారం జరిగినప్పటికీ ఏ కారణంగా నో నాయకత్వం పెండింగ్‌లో పెట్టింది. రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్ష పదవి పారిజాతకే దక్కుతుందని పార్టీ నాయకులు భావించినా ప్రకటించకుండా పెం డింగ్‌లో పెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినందున అభ్యంతరాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతున్నది.
సామాజిక సమతుల్యత: మహేష్ గౌడ్
ఇదిలాఉండగా డిసిసి అధ్యక్షుల ఎంపికలో సామాజిక సమతుల్యత పాటించామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పదిహేను మంది బిసిలకు, ఐదుగురు ఎస్‌టిలకు, ముగ్గురు ఎస్‌సిలకు డిసిసి పీఠాలు దక్కాయని వివరించారు.