సాధారణ ప్రయాణీకులకు రైల్వేలు తమ సేవలను మరింత సులభతరం చేశాయి. స్టేషన్‌కు వెళ్ళి జనరల్ టికెట్ల కోసం ఇ ప్పుడు క్యూలైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. టెకెట్‌ల కోసం హైరానా పడాల్సిన అవసరం లేదు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని టికెట్ సహా ఇతర సేవలు స్టేషన్‌కు వెళ్లకుండానే పొందవచ్చు. దీంతో సమయం కూడా ఆదా అవుతుంది. జనరల్ టికెట్ తీసుకోవాలంటే రైల్వే స్టేషన్‌కు వెళ్లి క్యూలైన్‌లో నిలబడి టికెట్ తీసుకోవాల్సిందే. అయితే ఎవరూ లైన్‌లో నిలబడకుండా, రైల్వే స్టేషన్‌కు రాకుండా టికెట్ తీసుకునేలా రైల్వేశాఖ చర్యలు తీసుకుంది.
ఇందు కోసం ప్రత్యేకంగా భారతీయ రైల్వే ‘యూటీఎస్‘ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యూటిఎస్ యాప్ పై ప్రయాణికుల్లో ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోంది. దీనిలో టికెట్ కొనుగోలు చేసే క్రమంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో పాటు, యూపిఐలను వినియోగించవచ్చు. దీంతో పాటు ‘ఆర్ – వాలెట్‘ను వినియోగించి టికెట్టు కొనుగోలు చేయవచ్చు. ఈ యాప్‌లో గరిష్ఠంగా రూ. 20 వేల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ యాప్‌ను రోజుకు సుమారు 90 వేల మందికి పైగా వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ యాప్ జనరల్, ప్లాట్ ఫాం, సీజనల్ టికెట్లు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.