‘లేబర్ కోడ్స్ దేశాభివృద్ధికి బాటలు వేసే సంస్కరణలు..’ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్‌ను తీసుకుని రావడం పట్ల ఆయన ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని కార్మిక చట్టాల చరిత్రలో ఇది ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు ప్రధాన లేబర్ కోడ్స్‌గా రూపొందించడం గొప్ప విషయమని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరళత, పారదర్శకత, సమర్ధత, కార్మికుల సంక్షేమం దృష్టా తీసుకున్న కీలక నిర్ణయం అని దత్తాత్రేయ తెలిపారు. లేబర్ కోడ్స్ ద్వారా వచ్చిన కీలక మార్పులతో అందరికీ సాంఘిక భద్రత, అసంఘటిత రంగం,
గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫార్మ్ వర్కర్ల వంటి వర్గాలకు కూడా రక్షణ పొందేలా మారిందని ఆయన వివరించారు. పరిశ్రమలకు సరళీకృత విధానాలు పెట్టుబడులు, ఉత్తత్తి, ఉద్యోగ అవకాశాలు పెరిగేలా వ్యవస్థను రూపొందించారని ఆయన ప్రశంసించారు. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం తదితర అంశాలు ఈ కోడ్ ద్వారా మెరుగైన పద్ధతిలో అమలులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. తాను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో ఈ సంస్కరణలకు సిద్ధమయ్యాయని ఆయన తెలిపారు. చట్టాలు కాగితాలపైనే కాకుండా కార్మికుల జీవితాలలో మార్పు తెచ్చేలా అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు.