సినిమాల పైరసీ తాను ఒక్కడినే చేశానని, తనకు ఎవరూ సహకరించలేదని ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి విచారణలో చెప్పాడు. పైరసీ సినిమాల కేసులో ఇమంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రవిని నాంపల్లి కోర్టు కస్టడీకి ఇవ్వడంతో పోలీసులు నాలుగు రోజుల నుంచి విచారణ చేస్తున్నారు. ఆదివారం సిసిఎస్ పోలీసులు రవిని విచారించగా సరిగా సమాధానాలు చెప్పనట్లు తెలిసింది. తన వద్ద ఉన్న హార్డ్ డిస్క్‌లను పోలీసులు తన ఇంటి తలుపు కొట్టగానే ఖాళీ చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసేందుకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు వెళ్లగా రవి రెండు గంటల వరకు ఇంటి డోర్ తీయలేదు.
ఈ సమయంలో తన వద్ద ఉన్న హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లో ఐ బొమ్మకు సంబంధించిన ఐపి అడ్రస్‌లు, వెబ్‌సైట్ వివరాలు డిలిట్ చేశాడు. వాటిలో కేవలం పైరసీ సినిమాలను మాత్రమే ఉన్నాయి. పైరసీ సినిమాల కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయడంతో తనను కూడా పోలీసులు పట్టుకుంటారని భావించి నెదర్లాండ్‌కు వెళ్లిపోయినట్లు చెప్పాడు. పైరసీ సినిమాలు చూసే అలవాటుతో వెబ్‌సైట్‌ను క్రియేట్ చేశానని చెప్పాడు. పైరసీ సినిమాల నుంచి వచ్చే డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేశానని, అమెరికా, థాయిలాండ్, దుబాయ్, ఫ్రాన్స్ తదితర దేశాలు తిరిగానని చెప్పాడు. ఇమంది రవికి హైదరాబాద్, విశాఖపట్టణంలో ఖరీదైన ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.