ముంబై: టీం ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడింది. మరికొన్ని గంటల్లో ఆమె పెళ్లి జరుగుతుందనే సమయంలో ఆమె కుటుంబంలో అనుకోని ఆపద వచ్చింది. స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ అస్వస్థతగా కనిపించారు.
వెంటనే ఆయన్ను సాంగ్లీలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితిలో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా ధృవీకరించారు. తండ్రి పూర్తిగా కోలుకునే వరకూ ఈ వేడుకను వాయిదా వేయాలని స్మృతి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
కాగా మంధాన వివాహం ఆదివారం సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో జరగాల్సి ఉంది. గత రెండు రోజులుగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్మృతి సహచర క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. కానీ, ఇంతలోనే ఇలా అనుకోని ఆపద రావడంతో స్మృతి వివాహాన్ని వాయిదా వేసుకుంది.