భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో బడుగు బలహీన వర్గాలలో బానిసత్వ విముకై పోరాటం మొదలైనది. ఇదే తెలంగాణలో బిసిల రిజర్వేషన్ ఉద్యమం. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఎవరమెంతో వారికి అంత వాటా అనే సిద్ధాంతం బలపడుతున్నది. పలు సభల్లో, వేదికల దగ్గర 90 శాతం ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు తమకు రావాల్సిన వాటాను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో అమలు కావాలని కోరుకుంటున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక కొంత మేరకు సమానత్వానికి పెద్దపీట వేశారు. అయినప్పటికీ ఇంకా వివక్ష ఛాయలు కొనసాగుతున్నాయి. అన్నివర్గాలకు జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బిసి రిజర్వేషన్లను 42 శాతం పెంపుతో సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. బిసి రిజర్వేషన్ల బిల్లు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపారు. ఇప్పుడది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడంతో చట్టరూపం దాల్చలేకపోయింది.
తక్షణం బిసి రిజర్వేషన్ 42 శాతం అమలతో స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించడానికి జిఒ 9 తీసుకొచ్చారు. ఇదీ న్యాయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అటు చట్టం, ఇటు జిఒ న్యాయస్థానాల్లో నిలవడం కష్టంగా మారింది. ఆ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడమే పరిష్కారమని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. మరోవైపు బిసి సంఘాల సైతం ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల పోరుకు సిద్ధమవుతోంది. పాత పద్ధతిలో అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్ 50 శాతానికి పరిమితం చేస్తూ ఇటీవల జిఒ 46 తీసుకొచ్చారు. ఈ క్రమంలో తొమ్మిదో షెడ్యూల్లో బిసి రిజర్వేషన్ చేర్చాలని నడుస్తున్న బిసి ఉద్యమంపై ప్రధాన బాధ్యత ఉంది.
భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనేది ఆయా వర్గాల ప్రాతినిధ్యం. ఎలాంటి పరిమితి విధించలేదు. సుప్రీం కోర్టు ఇందిరా సాహ్ని కేసులో ప్రతిభకు అవకాశం కల్పించాలని అసంబద్ధమైన 50 శాతం పరిమితిని విధించింది. ఇప్పుడు దేశంలో తమిళనాడు తరహాలో పలు రాష్ట్రాలు విద్య, ఉద్యోగాల్లో ఆయా వర్గాల ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్లను పెంచాలని భావిస్తున్నాయి. కోర్టు విధించిన 50 శాతం పరిమితితో అమలుకు నోచుకోవడం లేదు. 2023 లో బీహర్ ప్రభుత్వం 65 శాతం రిజర్వేషన్ పెంపును పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 42 శాతం బిసి రిజర్వేషన్ పెంపుకుసైతం కోర్టు చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో బిసి రిజర్వేషన్లను తమిళనాడు మాదిరిగా 9 వ షెడ్యూల్లో చేర్చాలని బిసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటయ్యింది. ఇందులో బిసి, ఎస్‌సి, ఎస్‌టి జెఎసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, ఉమ్మడి ఎపి రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. వీరి నాయకత్వంలోనే బిసి రిజర్వేషన్ల ఉద్యమం విజయవంతం కానుంది. వీరితోపాటు పలువురు బిసి, ఇతర కులసంఘ నాయకులు, మేధావులు కలిసి వస్తున్నారు. ఈ సమితి రాజకీయాలకతీతంగా నికార్సయిన నాయకత్వంతో బిసి కేటగిరీలకు 42 శాతం రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తుంది.
ఇది బిసి రిజర్వేషన్లకు శాస్త్రీయ పరిష్కారం కానుంది. న్యాయపరమైన రక్షణ లభించనుంది. ఈ రిజర్వేషన్లను రాజకీయ, విద్య, ఉద్యోగాల్లోనూ అమలుకై పటిష్టమైన ఉద్యమానికి పిలుపునిస్తున్నారు. కావున ప్రభుత్వం సైతం బిసి రిజర్వేషన్లను రాజకీయ కోణం గా చూడకుండా సబ్బండవర్గాల అభివృద్ధిగా భావించాలి. అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కోర్టులు సైతం ప్రతిభ పేరుతో అవకాశాలను లాక్ చేయడం సరికాదు. కాలమాన పరిస్థితుల కనుగుణంగా సుప్రీం కోర్టు 50 శాతం రిజర్వేషన్ పరిమితిని పునస్సమీక్షించాలి. అభివృద్ధి జరగాలంటే ఉచిత పథకాలకు బదులు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆర్థికవేత్తల భావన. ఇందుకై రిజర్వేషన్స్ పంపు దోహదపడనుంది.
అధికార వికేంద్రీకరణకు కేంద్ర బిందువు అయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి గ్రామాభివృద్ధి జరగాలని భారత రాజ్యాంగం కోరుకుంటుంది. ఈ అధికార వికేంద్రీకరణలో అట్టడుగు వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం లభించాలంటే 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు కావాలి. లేదంటే ధనస్వామ్య ప్రజాస్వామ్యంలో జనరల్ స్థానంలో ఒక నిరుపేద బిడ్డ గెలిచే అవకాశం లేదు. బిసి రిజర్వేషన్ల కోసం ఉద్యమించకపోతే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో బలమైన బిసి ఉద్యమం నడుస్తుంది. ఇటీవల కామారెడ్డిలో బిసి ఆక్రోష సభ నిర్వహించారు. ఈ విధంగా రిజర్వేషన్ల సాధన సమితి వైవిధ్యమైన పోరాటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. ఈ ఉద్యమానికి బిసిలు మరింత తోడై రావాలి. లేదంటే బిసిలు మరోసారి మోసపోతారు. కొందరు బిసి నాయకులు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ బిసిల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు. ఇది సరికాదు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా సీటు గెలవగానే వెనుకబడిన వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యమిచ్చే బిసి రిజర్వేషన్లపై పరిష్కారాన్ని పక్కన పెట్టారు. ఇది ఎటు తేలికముందే రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నది.
కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ సాధ్యం కానీ బిల్లులు, ప్రకటనలు చేస్తున్నారా అనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు ఏమాత్రం నిబద్ధత లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఓటు బ్యాంకు కోసం బిసి, ఎస్‌సి, ఎస్‌టి లను వాడుకుంటున్నారు. దేశం, రాష్ట్రాలు కులగణన రిజర్వేషన్ల పెంపు అనేవి సామాజిక న్యాయం, వనరుల సమాన పంపిణీకి విధాన రూపకల్పనగా చెప్పవచ్చు. ఎవరి వాటా ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తూ వనరుల పునః పంపిణీ జరగడమే. ఈ దేశ నిర్మాణంలో తన రక్తమాంసాలు ధార పోసిన ఈ వర్గాలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయం. దీనికి రిజర్వేషన్ 42 శాతం రిజర్వేషన్లు ప్రాతిపదిక కానున్నాయి. కానీ ప్రభుత్వం స్థానిక పోరుకు వెళ్లడమంటే మరొకసారి సబ్బండవర్గాలను మోసం చేయడమే. దీనిపై బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు ఏకమై మరో మండల కమిషన్ ఉద్యమంలా పోరాటం చేస్తే తప్ప సాధ్యమయ్యే పరిస్థితులు లేవు.
– సంపతిరమేష్ మహరాజ్
7989578428