78 సంవత్సరాల స్వతంత్ర పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాక పోగా, ఆర్థిక అసమానతలు తీవ్రతరం అయ్యాయి. పేదరికం తీవ్రంగా ఉంది. పేదలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. మొత్తం దేశ జనాభాలోని 10% మంది వద్ద 77% సంపద పోగుబడి ఉంది. ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం 2017లో సృష్టించబడిన సంపదలో 73% ఒక శాతంగా ఉన్న అత్యంత సంపన్నులకు చేరింది. కటికి పేదలుగా ఉన్న 67 కోట్ల మంది ప్రజల్లో సగం మంది ఆస్తిలో 1% పెరుగుదల మాత్రమే ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతున్నదని కొందరు ఆర్థికవేత్తలు ప్రచారం చేస్తుంటే, దేశం మాత్రం తీవ్ర అసమానతల మధ్య ఉంది. గ్రామీణ ప్రాంతం నిరంతర సంక్షోభం మధ్యలో ఉంటే, పట్టణాలలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పాలక ప్రభుత్వాల సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాముల అనుకూల విధానాల ఫలితంగా దేశం అప్పుల్లో కూరుకుపోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అప్పుల మీద అప్పులు చేస్తున్నాయి.
2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడేనాటికి దేశీయ అప్పు రూ. 55 లక్షల కోట్లు. మోడీ 11 సంవత్సరాల (2014- 2024-25 వరకు) పాలనలో దేశం అప్పు సుమారు రూ. 202 నుంచి రూ. 210 లక్షల కోట్ల దాకా ఉంటే, పెరిగిన అప్పు రూ. 150 కోట్లు. మొత్తం అప్పులో విదేశీ అప్పు రూ. 54 లక్షల కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ అప్పు కాకుండా దేశంలోని 28 రాష్ట్రాలు చేసిన అప్పులు రూ. 81 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధరి పార్లమెంటులో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 37.32% మొత్తం రుణాలపై వడ్డీలకే చెల్లిస్తున్నట్లు పార్లమెంట్‌లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ప్రపంచంలో అత్యధిక అప్పులు చేసిన 10 దేశాల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. తాజాగా వివిధ డేటాల సమాచారం ప్రకారం రాష్ట్రం అప్పులు బాగా పెరిగాయి. 2024 జూన్ నాటికి రాష్ట్ర అప్పు రూ. 5,19,192 కోట్లని రాష్ట్ర ఆర్థిక మంత్రి శాసనసభలో వెల్లడించారు. 2014 రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ వాటా అప్పు రూ. లక్షా 18 వేల కోట్లు. 2019 నాటికి రూ. 2 లక్షల 64 వేల కోట్లకు చేరింది. 2023 సంవత్సరం నాటికి రాష్ట్రం అప్పు రూ. 4 లక్షల 28 వేల కోట్లని ఆర్‌బిఐ పేర్కొంది. 2024 నవంబర్ నాటికి రాష్ట్రం అప్పు 9,47,000 కోట్ల రూపాయలు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని చంద్రబాబు చెబితే, కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న లెక్కల ప్రకారం రాష్ట్రం అప్పు రూ. 5.62 లక్షల కోట్ల. ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఇప్పటికే రూ. 2 లక్షలకు పైగా అప్పు చేసింది.
ఈ అప్పులు రాష్ట్ర జిడిపి 34.4% గా ఉంది. 2024 -25 సంవత్సరంలో అప్పులకు, వాటి వడ్డీలకు 58,253.30 కోట్ల రూపాయల అవసరమని కూటమి ప్రభుత్వం బడ్జెట్ పేర్కొంది. ఇందులో వడ్డీ చెల్లింపులకే రూ. 28,754.37 కోట్లు. అంటే అసలు కన్నా వడ్డీలకే ఎక్కువ చెల్లిస్తున్నారు. 2014-19లో తెలంగాణ అప్పు 69,603.87 కోట్లు. నేడు తెలంగాణ రాష్ట్రం అప్పు రూ. 5,04,814 కోట్లు. కెసిఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పు రూ. 3.5 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 2 వేల కోట్లకు పైగా అప్పు చేసింది. తెలంగాణ అప్పులపై కూడా వివాదం ఉంది. 202425 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అప్పులకు రూ. 23,337 కోట్లు వడ్డీ చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం అప్పులన్నీ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, విదేశీ వాణిజ్య బ్యాంకుల, విదేశీ రుణదాతల నుంచి తీసుకున్నది. ఈ అప్పులన్నీ విదేశీ కరెన్సీలో తీసుకున్నవి. మారకపు విలువ మార్పుపై ఈ అప్పుల ప్రభావం ఉంటుంది. డాలర్‌తో రూపాయి విలువ తగ్గడంతో దేశీయ రుణ చెల్లింపులు ఎక్కువ అవుతున్నాయి. దేశం మొత్తం అప్పు దేశ జిడిపిలో 55.60 శాతంగా ఉంది.
అప్పులు నేటి ప్రజలపైనే కాకుండా, రాబోయే తరంపైనా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ప్రజలు, తమకు అప్పు లేదని భావిస్తూ ఉంటారు. పాపం వారిపైన కూడా అప్పులభారం ఉందని వారికి తెలియదు. భారతదేశ జనాభా 142 కోట్లు ఉండగా, ఒక్కో వ్యక్తిపైన సగటు అప్పు సుమారు రూ. లక్షా 44 వేల నుంచి లక్షా 48 వరకు ఉంటుందని సాధారణ అంచనాగా ఉంది. రూపాయి విలువను బట్టి అప్పు మొత్తంలో మార్పులు ఉంటాయి. మోడీ పదకొండు ఏళ్లకాలంలో దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టు ఒక్కటీ స్థాపించలేదు. నీటి పారుదల ప్రాజెక్టు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఉపాధి పెంచలేదు. తెచ్చిన అప్పులన్నీ సంపన్న వర్గాల సౌకర్యాలకోసం జాతీయ రహదారులకు, విమానాశ్రయాలకు ఖర్చు చేసింది. వీటిని నిర్మించిన తర్వాత తిరిగి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నది. కార్పొరేట్ల రుణాల మాఫీకి రాయితీలు ఇవ్వడం చేస్తున్నది. కూటమి ప్రభుత్వ పరిస్థితి అదే. పాలకుల విధానాల ఫలితంగా దేశం అప్పుల ఊబిలో కూరుకుపోవటంవల్ల పేదరికం పెరుగుతూ, పేదలు దుర్బలమైన జీవితాలు గడుపుతున్నారు. కార్పొరేట్ల సంపదలు, లాభాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. 2020- 21లో 2.50 లక్షల కోట్ల రూపాయలగా ఉన్న కార్పొరేట్ల లాభం, 2024 -25లో 7 లక్షల, 10 వేల కోట్లకు పెరిగిందని ఆర్‌బిఐ బులిటిన్ తెలియజేసి, పలు కీలక విషయాలను వెల్లడించింది. సంవత్సర కాలంలో దేశంలో కార్పొరేట్ పన్నులను, వారి వ్యక్తిగత ఆదాయపు పన్నులు మించిపోయాయి. 2020-21 మధ్య కాలంలో వారి లాభాలు మూడింతలు పెరిగినట్లు ఆర్‌బిఐ నివేదిక పేర్కొంది భారతదేశంలో ఆర్థిక అసమానతలకు, సంపద కేంద్రీకరణకు, పేదరికానికి, ఉపాధి లేమికి, నిరుద్యోగానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాముల అనుకూల విధానాలే కారణం.
– బొల్లిముంత సాంబశివరావు
98859 83526