మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడి యం శ్రీహరికి స్పీకర్ ఇచ్చిన నోటీసుకు సమాధా నం ఇచ్చేందుకు గడువు ఆదివారం (23)తో ముగియనుంది. అయితే స్పీకర్ ప్రసాద్ కుమార్ వారిరువురికి మరింత గడువు ఇస్తారా? లేక గడువులోగా సమాధానం ఇవ్వలేదని వేటు వేస్తారా? అనే ఉత్కం ఠ నెలకొంది. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు పది మంది ఎంఎల్‌ఏలపై ఆ పార్టీ నేత (ఎంఎల్‌ఏ)లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
పది మంది ఎంఎల్‌ఏలకు స్పీకర్ రెండు నెలల క్రితం నోటీసులు పంపించగా, ఎనిమిది మంది ఎంఎల్‌ఏలు కౌంటర్ దాఖలు చేశారు. కాగా ఇద్దరు ఎంఎల్‌ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ నోటీసుకు సమాధానం చెప్పకుండా, న్యాయ నిపుణులతో చర్చించి సమాధానం చెప్పేందుకు తమకు సమయం గడువు కావాలని కోరారు. కాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 23వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఈ నెల 13న మలి విడత నోటీసు ఇచ్చారు. కాగా కడియం శ్రీహరి శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి తనకు మరి కొంత గడువు కావాలని కోరారు. అయితే తన విజ్ఞప్తికి స్పీకర్ ప్రసాద్ కుమార్ సానుకూలంగా స్పందించారని కడియం శ్రీహరి చెప్పారే తప్ప సానుకూలంగా ఉన్నట్లు స్పీకర్ గానీ, స్పీకర్ కార్యాలయంగానీ వెల్లడించ లేదు.
శ్రీధర్ బాబుతో దానం భేటీ
ఇదిలా ఉండగా స్పీకర్ నోటీసుకు సమాధానం ఇవ్వాల్సి ఉన్న ఎంఎల్ ఏ దానం నాగేందర్ శనివారం రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబును కలిసి మంతనాలు జరిపారు. అనర్హత వేటు పడక ముందే రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు దానం మంత్రికి వివరించారు. శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం, గెలుపు సాధ్యసాధ్యాలపై వారిరువురు చర్చించారు. స్పీకర్ ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పేందుకు ఆదివారం గడువు ముగియనున్నందున దానం నాగేందర్ మరింత గడువు కోరుతారా? లేక రాజీనామా లేఖ అందజేస్తారా? అనే ఉత్కంఠత నెలకొంది.
నేనే పోటీ చేస్తా: కడియం
ఇదిలాఉండగా సమాధానం చెప్పేందుకు తనకు మరింత గడువు కావాలని ఎంఎల్‌ఏ కడియం శ్రీహరి కోరిన సంగతి తెలిసిందే. కాగా దానం, కడియంతో కాంగ్రెస్ అధిష్ఠానం రాజీనామా చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే రాజీనామా చేయాల్సి వస్తే తిరిగి తానే పోటీ చేసి గెలుపొందుతానని కడియం ధీమాగా చెబుతున్నారు. స్పీకర్ గడువు ఇస్తే న్యాయ నిపుణులతో చర్చించి, సమాధానం ఇస్తానని ఆయన తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న తపనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశానని కడియం శ్రీహరి చెప్పారు.