మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఎ దుట ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా 37 మంది మావోయిస్టులు శనివారం డిజిపి కార్యాలయంలో లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలు డిజిపి శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపులో భాగంగా మావోయిస్టులు లొంగుబాటు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్ర స్తుతం లొంగిపోయిన మావోయిస్టులు పార్టీ సిద్ధాంతాల తో విబేధించడం, అనారోగ్య కారణాలు, ప్రభుత్వ ప్రో త్సాహాం, దండకారణ్యంలో పోలీస్ కూంబింగ్, వరుస ఎన్‌కౌంటర్‌లు లాంటి అనేక కారణాలతో జనజీవన స్ర వంతిలోకి వస్తున్నట్లు డిజిపి చెప్పారు. లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు వారం క్రితమే తమ ఆధీనం లో ఉన్నారని డిజిపి తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు బికె ఏఎస్‌ఆర్ డివిజనల్ కమిటి కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజా ద్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, సాంకేతిక విభాగం ఇంచార్జ్ అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, రాష్ట్ర కమిటీ స భ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి ముచ్చకి సోమడా అలియాస్ ఎర్రలు ఉన్నారన్నారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులతో 34 మంది మావోయిస్టులు ఉన్నారని, వారిలో రాష్ట్ర కమిటీకి చెందిన ఏడుగురు ఖమ్మం డివిజన్ కమిటీ సభ్యులు, ముగ్గురు బికెఏఎస్‌ఆర్ డివిజన్ కమిటీ సభ్యులు, 22 మంది దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ నాయకులు, సభ్యులు, ఇద్దరు పిఎల్‌జిఏ ఒకవట బెటాలియన్ కమాండర్‌లు ఉన్నట్లు డిజిపి పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు తమ ఆయుధాలను పోలీసులకు అ ప్పగించగా, వీటిలో ఒక ఏకే 47, రెండు ఎస్‌ఎల్‌ఆర్ లు, నాలుగు 303 తుపాకీలు, ఒక జి3 తుపాకీ, వివిధ కాలిబర్లకు చెందిన 346 తూటాలు ఉన్నాయన్నారు.
లొంగిపోయిన 37 మంది మావోయిస్టుల్లో 25 మంది మహిళా మావోయిస్టులు, 12 మంది పురుషులు ఉన్నారు. గత 11 నెలల్లో 465 మంది మావోయిస్టులు రాష్ట్ర పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు డిజిపి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో ఐదుగురు కేంద్ర కమిటి సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రాం, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్ గణేష్, బడే చోక్కారవు అలియాస్ దామోదర్‌లు ఉండగా, పది మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో భవనాంద రెడ్డి, జోడే రత్నాబాయ్, లోకేటి చందర్, వార్తా శేఖర్, బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి, ముప్పిడి సాంబయ్య, మేకల మనోజ్, కర్రా వెంకట్ రెడ్డి, గంగిడి సత్యనారాయణ రెడ్డిలు ఉన్నారని డిజిపి తెలిపారు. మిగిలిన నాయకులందరూ లొంగిపోవాలని, ఏ రకంగా వచ్చినా మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని డిజిపి చెప్పారు.
మీడియా ద్వారా వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వచ్చినా, రాజకీయల నాయకుల ద్వారా వచ్చి నా, ఏ విధంగా వచ్చినా స్వాగతిస్తామన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులకు రూ. 20 లక్షలు, మిగిలిన వారికి తక్షణ సాయంలో భాగంగా రూ. 25 వేలు, ఆయా కేడర్లను అనుసరించి ఇతర రివార్డును అందించామన్నారు. మొత్తం 37 మంది మావోయిస్టులకు రూ. 1,41,05,000 చెక్కులను డిజిపి అందచేశారు. దీంతో పాటు పునరావాసంలో భాగంగా లభించే సౌకర్యాలు లొంగిపోయిన వారికి కల్పిస్తామని డిజిపి స్పష్టం చేశారు.
సుదీర్ఘ కాలం అజ్ఞాతంలోనే
లొంగిపోయిన రాష్ట్ర కమిటీ మావోయిస్టులు సుదీర్ఘ కాలం అజ్ఞాతంలోనే గడిపారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం, మొద్దుల గూడెం స్వగ్రా మం కాగా ఆయన గత 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. మరోక రాష్ట్ర కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ పెద్దపల్లి జిల్లా రామగుండం కాగా, 32 సంవత్సరాలుగా పలు హోదాల్లో పనిచేశారు. ముచ్చకి సోమడా అలియాస్ ఎర్ర చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, జేగర్‌గుండా పి.ఎస్ పరిధిలోని పెంటా స్వగ్రామం కాగా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి ఉన్నారు.
పార్టీకి చెప్పే లొంగిపోయాం : ఆజాద్
పార్టీ నాయకత్వానికి చెప్పే లొంగిపోయామని కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర కమిటిలో ఉన్న నేతలు లొంగిపోవాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. జాతీయ కార్యదర్శి ఎవరు అని మీడియా అడిగిన ప్రశ్నకు తనకు తెలియదని ఆజాద్ సమాధానం చెప్పారు. పార్టీలో ఎటువంటి ఆదిపత్య పోరులేదని ఆయన స్పష్టం చేశారు.
దండకారణ్యంలో ఉండి పనిచేయడం కష్టం : ఎర్ర
దండకారణ్యంలో ఉండి పనిచేయడం కష్టంగా మారిందని, ప్రభుత్వ ప్రోత్సాహంతో లొంగిపోయామని రాష్ట్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి ముచ్చకి సోమడా అలియాస్ ఎర్ర తెలిపారు. వరుసగా మావోయిస్టులు మృతి చెందుతున్నారని, ప్రజా జీవితంలొ పనిచేయాలనే జనజీవన స్రవంతిలోకి వచ్చామని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వరుస ఘటనలతో మావోయిస్టు పార్టీకి భారీ షాక్
మార్చి 2026 కల్లా మావోయిస్టులను ఏరివేస్తామని ప్రకటించిన కేంద్రం అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ ప్రారంభించింది. ఆపరేషన్ కగార్‌తో అటవీ ప్రాంతాలను భద్రతా దళాలు విస్తృతంగా జల్లెడపట్టడంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్దకంగా మారింది. వరుస ఎన్‌కౌంటర్లతో పార్టీ కీలక నాయకత్వం, సభ్యులను కోల్పోగా, రిక్రూట్ మెంట్ సైతం ఆగిపోయింది. తమకు కంచుకోటగా ఉన్న అడవులు భద్రతా దళాలకు ఆవాసాలుగా మారడంతో మావోయిస్టులు తమ ఉనికి కోసం పట్టు లేని ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఈ క్రమం లో ఈ ఏడాదిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజు, కేంద్ర కమిటి సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేష్, కట్టా రామచంద్రా రెడ్డిలు ఎన్ కౌంటర్లలో మృతి చెందారు. అనారోగ్య, ఇతర కారణాలతో మాల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న, బండి ప్రకాశ్‌లతో పా టు భారీ సంఖ్యలో సభ్యులు ఆయుధాలు వీడారు. తా జాగా కీలక నాయకులు మాడవి హిడ్మా, ఆయన భార్య రాజే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, ప్రస్తుతం 37 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది.