మనతెలంగాణ/హైదరాబాద్: అందె శ్రీ తనకు అత్యంత అప్తుడని, తన మనసుకు దగ్గరి వాడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాచరికం, ఆధిపత్యం హద్దు మీరినప్పుడు కవులు, కళాకారులు తమ గొంగడి దుమ్ము దులిపి పోరాటంలోకి దూకారని ఆయన అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా బండి యాదగిరి బండెనక బండి కట్టి అని గళం విప్పితే సర్కార్ పీఠం కదిలిందన్నారు. సమైక్యవాదాలకు వ్యతిరేకంగా గద్దర్, గూడ అంజన్న, అందె శ్రీ, గోరెటి వెంకన్న తెలంగాణ విముక్తి కోసం మలిదశ ఉద్యమానికి పునాదులు వేశారని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బడి ముఖం ఎరుగని అందెశ్రీ జయ జయ హే తెలంగాణ పాట రాసి స్పూర్తిని నింపారురని, ప్రతి తెలంగాణ గుండెకు జయ జయహే తెలంగాణ పాటను అందెశ్రీ చేర్చారని ఆయన తెలిపారు. జయ జయ హే తెలంగాణ పాట ను రాష్ట్ర అధికార గీతంగా అందరూ భావించారని, కానీ ఆ నాటి పాలకుల వల్ల జయజయ హే తెలంగాణ పాట మూగబోయిందన్నారు. అధికారం శాశ్వతం అని వారు ఆనాడు భావించారని, తెలంగాణ లో స్పూర్తిని నింపిన కవులు, కళాకారుల గానం తెలంగాణలో వినిపించకుండా కుట్ర చేశారని, పెన్నులపైన మన్ను కప్పితే గన్ను లై మొలకెత్తుతాయని, గడీలను కూల్చుతాని అందెశ్రీ నిరూపించారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శనివారం నిర్వహించిన అందెశ్రీ సంతాపసభలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో
కవులు, కళాకారులదే కీలక పాత్ర
ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకంగా కనిపిస్తారు, కానీ, అమాయకులు కాదని ఆయన అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన ఎవరూ ఆధిపత్యాన్ని, అహంకారాన్ని సహించరన్నారు. నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఎంతోమంది కవులు, కళాకారులు తమ ఆట, పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులదే కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. వాళ్లు తీసుకొచ్చిన ఊపుతోనే తెలంగాణ కల సాకారమైందన్నారు. అందెశ్రీ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించుకోలేమని ఆయన అన్నారు. ఆయన పాటలు తెలంగాణ ప్రజలను ఎంతో ఉత్తేజపరిచాయని ఆయన వెల్లడించారు. ఉద్యమ సమయంలో ఆయన పాటలు మార్మోగాయని అదే సమయంలో ఉద్యమంలో ఆయన పాత్ర లేకుండా చేయాలని కూడా కొందరు కుట్ర చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమం గురించి ఎక్కడ చర్చ వచ్చినా
తెలంగాణకు రెండు కళ్ల లాంటి వారైన అందెశ్రీ, గద్దర్ కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే జయజయహే గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించామన్నారు. ప్రతి పాఠ్యపుస్తకంలో గీతాన్ని చేర్చామని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. చదువుల్లోనే కాదు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లోనూ ఎస్సీల ప్రాతినిథ్యం పెరగాలని దానికి ప్రజాప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివర్గంలోనూ ఎస్సీలకు సముచిత స్థానం ఇచ్చినట్లు సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ చరిత్రలో అందెశ్రీ ఒక కోహినూర్ వజ్రం
అందె శ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యత అని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజా పాలన రావాలని గద్దర్, అందె శ్రీ కోరుకున్నారని, అందె శ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని, అందె శ్రీ స్మృతి వనాన్ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అందెశ్రీ పుస్తకం నిప్పుల వాగును ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని సిఎం పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది కవులకు 300 గజాల ఇంటిస్థలం ఇచ్చామని, భారత్ ప్యూచర్ సీటీలో వారికి ఇంటిని నిర్మించి ఇస్తామని, దేశంలో వర్గీకరణ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, వర్గీకరణ అమలు వల్ల దళితుల్లో అత్యంత వెనుకబడిన వాళ్లు డాక్టర్లు అవుతున్నారని, తన మంత్రివర్గంలో నలుగురు దళితులు మంత్రులుగా ఉన్నారని, కవులు ఎంతమంది ఉన్నా తెలంగాణ చరిత్రలో అందె శ్రీ ఒక కోహినూర్ వజ్రంలా నిలిచిపోతారని ఆయన తెలిపారు.