తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పదిమంది శాసనసభ్యుల అనర్హత విషయమై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రానున్న నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అని తీవ్రంగా వ్యాఖ్యానించడంతో ఎక్కడెక్కడ, ఏ ఏ వ్యవస్థల్లో, ఎన్నెన్ని కేసులు, పిటిషన్లు ఏళ్ళుపూళ్ళు గడిచిపోయినా, కాల పరిమితి ముగిసినా తుది నిర్ణయం రాకుండా పడి ఉన్నాయో, ఎంతమంది ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్న చర్చ జరగాల్సిన అవసరం ఏర్పడింది. ఇవ్వాళే జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తుండటం కాకతాళీయం.
తెలంగాణ స్పీకర్ చేసింది తీవ్రమైన కోర్టు ధిక్కారమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి అనడం అంటే నాలుగు వారాల్లోగా పార్టీ ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకోకపోతే జైలుకు పంపుతామని చెప్పడమే కదా. పార్టీ ఫిరాయింపుల మీద తాము విధించిన మూడు మాసాల గడువు దాటిపోయినా ఒక నిర్ణయం తీసుకోనందుకు తెలంగాణ స్పీకర్ మీద ఆగ్రహించిన ఇదే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తో కూడిన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పార్లమెంట్ లేదా వివిధ రాష్ట్రాల శాసన సభలూ ఆమోదించిన బిల్లులను త్వరగా పరిష్కరించాలని కోర్టులు జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నది. బిల్లులను సుదీర్ఘ కాలం పెండింగ్‌లో పెట్టుకునే అధికారం గవర్నర్‌లకు లేదంటూనే కోర్టులు గడువు విధించలేవని చెప్పింది. తమ పరిధిలో నిర్ణయాలు తీసుకునే విషయంలో రాజ్యాంగ వ్యవస్థలకు కాల పరిమితి అంటూ ఏమీ నిర్దిష్టంగా లేదు. గురువారం నాడు సుప్రీం కోర్టు కొద్ది కాలం క్రితం రాష్ట్రపతి లేవనెత్తిన సందేహాలకు ఇచ్చిన రాజ్యాంగ పరమయిన వివరణ లేదా విశ్లేషణతో ఆ విషయం అర్థ్ధం అవుతున్నది. న్యాయస్థానాలు, రాష్ట్రపతి, గవర్నర్‌లు, పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్ వ్యవస్థలు తమకు సంక్రమించిన రాజ్యాంగ పరిధిలో తీసుకునే నిర్ణయాలకు రాజ్యాంగం లేదా చట్టాలూ స్పష్టమైన కాల పరిమితి ఏదీ విధించలేదు.
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న కనీసం నాలుగు రాష్ట్రాలలో 33 బిల్లులు గవర్నర్‌ల ఆమోదం కోసం వేచిచూస్తున్నాయి. ఇందులో అత్యధికంగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఈ జాప్యం రాష్ట్ర ప్రభుత్వాలూ గవర్నర్‌ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఎటువంటి వివరణ లేకుండా సుదీర్ఘ కాలం బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్‌ల మీద సుప్రీం కోర్టు గడప తొక్కిన విషయం జగద్విదితం. పశ్చిమ బెంగాల్ ఉదాహరణే మళ్ళీ తీసుకుంటే ఆ రాష్ట్రం లో 2022 నుండి ఏడు బిల్లులు, 2023 నుండి ఒక బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ బిల్లులన్నీ యూనివర్శిటీ చట్టాలకూ, పట్టణ గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించినవి.
అసంఖ్యాకంగా వచ్చే కోర్టు కేసులు కూడా పరిష్కరించడానికి రాజ్యాంగం స్పష్టంగా కాలపరిమితి ఏదీ విధించలేదు. న్యాయ వ్యవస్థ తానే రూపొందించుకున్న విధానాలు, నిబంధనల ఆధారంగా వ్యవహరిస్తుంది. అయితే విచారణ వేగవంతంగా జరగాలన్న అంశం రాజ్యాంగం లోని ఆర్టికల్ 21తో ముడిపడి ఉండటమేకాక కేసుల వాయిదాల సంఖ్యా తగ్గించే క్రమంలో నిబంధనల్లో మార్పులు చేయడం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలు కొంత అక్కర కొస్తున్నాయి.
వాస్తవ పరిస్థితుల మీద ఒకసారి దృష్టి సారిస్తే దిగువ కోర్టుల్లో నాలుగు కోట్ల అరవై లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారిక లెక్కలు చెపుతున్నాయి. వివిధ హైకోర్టులలో 63 లక్షలు, సుప్రీం కోర్టు లో 87 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఈ ఏడాది జులై 31 నాటి గణాంకాలు. దిగువ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అధిక భాగం భూతగాదాలకు సంబంధించినవే కావడం విశేషం.
శాసన, న్యాయ వ్యవస్థలు రెండు రాజ్యాంగబద్ధమైన సంస్థలే. రెండు వ్యవస్థల అధికారాలు దేనివి దానికే ఉంటాయి. పార్టీ ఫిరాయింపుల మీద ఏ కారణం చేతనైనా ఒకవేళ తెలంగాణ శాసనసభ అధ్యక్షుడు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోలేకపోతే నిజంగానే ఆయనను జైలుకు కూడా పంపే అంతటి కఠిన నిర్ణయం సుప్రీం కోర్టు తీసుకునే అవకాశం ఉందా! అది న్యాయ వ్యవస్థ పరిధిని దాటి ఉంది అనిపించడం లేదా అన్న చర్చ జరుగుతున్నది. మరి వివిధ కోర్టు లలో పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న కోట్లాది కేసుల గురించి ఏం చెబుతారు. తెలంగాణ స్పీకర్ మీద సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య తీర్పులో భాగంగా వెలువరించింది కాదు. వాదనలు సాగుతున్న సమయంలో చేసిన వ్యాఖ్య మాత్రమే. సరే ఈలోగా గత రెండు మూడు రోజులుగా తెలంగాణ స్పీకర్ పదిమంది శాసనసభ్యుల ఫిరాయింపు వ్యవహారంలో విచారణ కూడా వేగవంతం చేశారు. నాలుగు వారాల్లోగా ఒక నిర్ణయం జరుగుతుందని స్పీకర్ తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన ఇద్దరు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహాత్గి కూడా సుప్రీం కోర్టు ధర్మాసనానికి హామీ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం అంతిమంగా ఎలా ఉంటుందో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
తెలంగాణ అసెంబ్లీ లో ప్రస్తుతం ఓ పదిమంది శాసన సభ్యులు భారత రాష్ట్ర సమితి నుండి అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అనర్హత వేటు పడుతుందేమో అన్న అనుమానం రావడంతో కండువా కప్పుకుంటే, నియోజక వర్గం అభివృద్ధి పనులకోసం ముఖ్యమంత్రిని కలిస్తే, సరదాగా కబుర్లు చెప్పుకుని చాయ్ తాగడానికి పిసిసి సభ్యుడిని కలిస్తే పార్టీ మారినట్టా అని బుకాయిస్తున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్టు 2014 లో రాష్ట్రం ఏర్పడి తాము అధికారం లోకి వచ్చిన దగ్గరినుండి అధికారం కోల్పోయే దాకా బిఆర్‌ఎస్ ఉజ్జాయింపుగా ఓ 38 మంది శాసన సభ్యులను ఇతర పార్టీల నుండి చేర్చుకున్న విషయం ఎవరయినా మరిచిపోతారా. అట్లా అని ప్రస్తుతం ఫిరాయించిన వారిని సమర్థించాల్సిన అవసరం లేదు. అయినా రాజకీయాల్లో నైతికత కోసం వెతకడం ఏమిటి నేతి బీరకాయల్లో నెయ్యి కోసం వెతికినట్టు.
అయితే ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన వారిలో ఇద్దరి మీద మాత్రం వేటు తప్పనిసరి. అందులో ఒకరు ఖైరతాబాద్ శాసన సభ్యుడు దానం నాగేందర్, ఆయన 2023 లో బిఆర్‌ఎస్ తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికై 2024 లోక సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచి ఓడిపోయారు, పార్టీ మారిన ఆధారం స్పష్టంగానే ఉంది. ఈయన కాంగ్రెస్ నుండి తెలుగుదేశం పార్టీకి, అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్‌కు తిరిగి బిఆర్‌ఎస్‌కు, ఇప్పుడు తిరిగి సొంత గూడు అంటూ కాంగ్రెస్‌కు చేరుకున్నారు ప్రజా సేవ కోసం.
ఇక రెండో నాయకుడు కడియం శ్రీహరి, వీరు 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా స్టేషన్‌ఘనపూర్ నుండి గెలిచి ప్రజా సేవ కోసమే అధికార పక్షం లో చేరారు. అయితే కూతురికి కాంగ్రెస్ లోకసభ స్థానం నుండి టికెట్ ఇప్పించుకుని ఆమె గెలుపు కోసం కృషి చేయడం వల్ల అనర్హత తప్పేట్టు లేదు. శ్రీహరి రాజకీయాలతోబాటు పార్టీ ఫిరాయించడంలో కూడా సీనియర్‌యే. తెలుగుదేశం నుండి భారత రాష్ట్ర సమితికి అక్కడి నుండి కాంగ్రెస్‌కు మారారు.
వీరిరువురూ వేటు పడక ముందే రాజీనామా చేస్తారని వార్తలొస్తున్నాయి. స్పీకర్ మీద సుప్రీం కోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యం లో ఒకవేళ వేటు పడితే ఆరు నెలల వరకూ పోటీచేసే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉన్నందున తామే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని అనుకుంటున్నారని సమాచారం. మొన్ననే జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక గెలిచిన ఊపులో ఉంది అధికార పక్షం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ఆ స్థానాన్ని పార్టీకి దక్కేట్టు చేసారు. ఆ పొరుగునే ఉన్న ఖైరతాబాద్ కూడా అదే ఊపులో గెలవచ్చన్న ధీమా ఉండొచ్చు. స్టేషన్ ఘనపూర్ గెలిస్తే కాంగ్రెస్ బలంలో ఒకటి పెరిగినట్టు, పోయినా అది ప్రతిపక్షానిదే కాబట్టి బెంగ లేదు.
మిగిలిన ఎనిమిది మంది శాసన సభ్యుల విషయంలో ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పశ్చిమ బెంగాల్‌లో జరిగింది చూసి కొంత ఉత్సాహం తెచ్చుకున్నది. ఇటీవల పశ్చిమబెంగాల్‌లో బిజెపి నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు ఫిరాయించిన శాసనసభ్యుడు ముకుల్‌రాయ్ బిజెపి వీడిపోయినట్టు ఆధారాలు లేవని ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రకటించడంతో బిజెపి వేసిన పిటిషన్ మీద హైకోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా ఒకవేళ అక్కడి స్పీకర్ లాగానే వీళ్ళంతా బిఆర్‌ఎస్ వీడిన ఆధారాలు లేవని తేల్చినట్టయితే కోర్టులు తమకు న్యాయం చేస్తాయన్నది ఆ పార్టీ ఆశ కావచ్చు. అదలా ఉంచితే ఒక విషయం ఇక్కడ తప్పనిసరిగా చర్చించాలి. 1985లో రాజ్యాంగ సవరణద్వారా ఏర్పాటైన పార్టీ ఫిరాయింపుల చట్టం పార్టీ ఫిరాయింపుల మీద శాసనసభ స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలి అన్న విషయంలో స్పష్టతనివ్వలేదు.
నిజానికి ఈ చట్టం ఎంతో లోపభూయిష్టంగా ఉన్నదనడానికి చట్టం అమల్లోకి వచ్చిననాటి నుండి నేటివరకు జరిగిన అనేక ఉదంతాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2004 2009 మధ్య అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పదిమంది శాసన సభ్యులు పార్టీ నిర్ణయాన్ని కాదని శాసనమండలి ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేసిన కారణంగా వారందరి మీద అనర్హత వేటు వేయాలని టిఆర్‌ఎస్ కోరినప్పటికీ ఆనాటి స్పీకర్ ఆ శాసనసభ పదవీకాలం ముగిసే వరకు ఈ వ్యవహారాన్ని తేల్చకుండా చివరకు 2009లో సమావేశాలు ముగింపుకొచ్చిన సమయంలో వారిని అనర్హులుగా ప్రకటించారు. ఇటువంటి ఉదాహరణలు మనకు దేశంలోని పలు శాసనసభల్లో, రాజ్యసభలో కూడా అనేకం కనిపిస్తాయి. 2019 లో ఎన్నికలలో ఓడిపోగానే తెలుగు దేశం రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన వైనం ఉదాహరణే కదా, అంతకు ముందు అధికారం లో ఉండగా ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌సిపి నుండి 23 మంది శాసన సభ్యులను, ముగ్గురు లోక్‌సభ సభ్యులను తెలుగుదేశంలో చేర్చుకుని ఓ నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు కదా చంద్రబాబు నాయుడు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యుడు పార్టీకి రాజీనామా చేయకుండానే అప్పటి టిఆర్‌ఎస్ మంత్రివర్గంలో సభ్యుడిగా చేరారు. పార్టీ ఫిరాయింపుల చరిత్ర ఈ రోజుదా, 1967 లో హర్యానాలో గయా లాల్ అనే శాసన సభ్యుడు పక్షం రోజుల్లో మూడు సార్లు పార్టీ మారాడు, కాంగ్రెస్ నుండి యునైటెడ్ ఫ్రంట్‌కు మళ్ళీ తిరిగి కాంగ్రెస్‌కు అది జరిగిన తొమ్మిది గంటల్లోనే మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్‌కు మారి ఆయారాం గయారాం అనే నానుడిని వాడుకలోకి తెచ్చారు. గెలిచి వచ్చిన పార్టీకి రాజీనామా చేయకుండా అధికార పక్షంలోకి వలసపోయిన సందర్భాలు పలు శాసనసభల్లో బోలెడు.
పార్టీ ఫిరాయింపుల విషయం అయినా, గవర్నర్‌ల దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లులయినా, కోట్లాది కోర్టు కేసులయినా ఏ మాత్రం జాప్యం లేకుండా పరిష్కారం అయిపోయే మార్గం ఆలోచించాల్సిందే తప్ప పరస్పర విమర్శల వల్ల ఫలితంలేదు. అన్ని వ్యవస్థలూ అంతిమంగా ప్రజలకే కదా జవాబుదారీగా ఉండాలి. అప్పుడప్పుడు ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పలు సమస్యలు చర్చకు వస్తాయి, పరిష్కారాల గురించి కూడా ఆలోచిస్తారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యానం నేపథ్యంలో తప్పనిసరిగా ఈసారి జరిగే స్పీకర్ల సమావేశం లో దీని మీద చర్చించి ఒక పరిష్కారాన్ని కనుగొంటే బాగుంటుంది.
DeleteEdit
