చిరుతడే కానీ…చిరుతతో పోట్లాడాడు. తనను తాను కాపాడుకుని, తోటి బాలుడిని కూడా కాపాడి, పులిని తరిమికొట్టాడు. మహారాష్ట్రలోని పల్ఘార్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 11 సంవత్సరాల బాలుడు మయాంక్ కువారా శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లుతుండగా మధ్యలో ఉన్నట్లుండి పొంచి ఉన్న చిరుత పులి వచ్చి ఈ బాలుడిపై దాడికి దిగింది. ఆదమరిచి ఉంటే క్షణాలలో బాలుడి ప్రాణాలను హరించివేసేది. అయితే మీద పడింది చిరుత పులి అని తెలిసినా భయపడకుండా ఈ బాలుడు పులిపై తిరగబడ్డాడు. తన తోటి బాలుడితో కలిసి రాళ్లతో, చేతిలోని బ్యాగుతో తలపడ్డాడు. ఓ వైపు బ్యాగ్‌తో తనను తాను కాపాడుకుంటూ, మరో వైపు దానితోనే పులిపై ఎదురుదాడికి దిగాడు. పెద్దగా అరుపులతో కలబడిన క్రమంలో అక్కడికి సమీపంలోని వారు ఉరికివచ్చారు. ఈ లోపునే చిరుత పులి ఈ బాలుడు ఘటికుడే,
చేసేదేమి లేదని అడవుల్లోకి తోకజాడిస్తూ పారిపోయింది. ఈ బాలుడి ధైర్యసాహసాలకు ఊర్లు ఊర్లు అన్ని వారెవా అని ఆనందించాయి. చేతిలో బ్యాగ్‌లేకుండా ఉంటే ఏమి చేయలేకపోయేవాడినని ఈ బాబు తరువాత అక్కడి వారికి చెప్పాడు. పులి పంజా దెబ్బకు బాలుడి చేతికి గాయాలు అయ్యాయి. విక్రమ్‌గఢ్ ఆసుపత్రిలో కుట్లు వేసి చికిత్స జరిపారని అక్కడి వైద్యాధికారి తెలిపారు. విషయం తెలియగానే అక్కడి కంచడ్ అటవీశాఖ అధికారి స్వప్నిల్ మెహితే ఘటనాస్థలికి చేరారు. సిబ్బందితో కలిసి బాలుడిని అభినందించారు. ఈ ప్రాంతంలో స్కూళ్లను మధ్యాహ్నం నాలుగు గంటల వరకూ తెరిచి ఉంచాలని, పిల్లల విషయంలో జాగ్రత్తలు అవసరం అని కోరారు. ఈ ప్రాంతంలో జన సంచారంలో పులుల రాక తెలిపే ఎఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు.