విహార యాత్రకు వెళ్లిన ఓ స్కూల్ విద్యార్థి అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిన మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమీర్‌పేటలోని సిస్టర్ నివేదిత స్కూల్‌లో దమరుక్ సూర్యతేజ ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాడు. ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను శుక్రవారం వండర్‌లా విహార యాత్రకు తీసుకుని వెళ్లారు. అక్కడ పిల్లలకు పలు యాక్టివిటీస్, గేమ్స్ ఆడించారు. ఈ సమయంలో దమరుక్‌తో ఉపాధ్యాయులు అతడి వయస్సుకు మించి యాక్టివిటీస్ చేయించడంతో తట్టుకోలేక అక్కడ కుప్పకూలినట్లు తెలిసింది. వెంటనే అక్కడి నుంచి పాఠశాల ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పినట్లు తెలిసింది. తమ కుమారుడిని విహారా యాత్రకు తీసుకుని వెళ్లి చనిపోయేలా చేశారని తల్లిదండ్రులు నిలదీయగా వారిని పాఠశాల యాజమాన్యం బెదిరించి విషయం బయటికి రాకుండా చూశారని తెలిసింది.
విద్యార్థి మృతి తీరనిలోటుః పాఠశాల యాజమాన్యం
విద్యార్థి దమరుక్ మృతి తమ పాఠశాలకు తీరని లోటని నివేది పాఠశాల యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. విద్యార్థిని రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేశామని, లాభం లేకుండా పోయిందని తెలిపారు. విద్యార్థుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.