ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారతఎ జట్టు పోరాటం సెమీ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీస్ సమరంలో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ సూపర్ ఓవర్‌లో భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ హబిబుర్ రహ్మాన్ ఐదు సిక్సర్లు, 3 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జీషాన్ ఆలం 14 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు. చివర్లో ఎస్‌ఎమ్ మాహ్బ్ 18 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 48 పరుగులు చేశాడు. యాసిర్ అలీ 17 (నాటౌట్) కూడా చెలరేగడం బంగ్లా భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఎ టీమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా అయ్యింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లోనే 38, ప్రియాన్ష్ ఆర్య 23 బంతుల్లో (44) పరుగులు చేసి శుభారంభం అందించారు. జితేశ్ శఱ్మ (33), నెహాల్ వధెరా 32 (నాటౌట్)లు కూడా రాణించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. తర్వాత సూపర్‌లో ఫలితాన్ని తేల్చారు. తొలి బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే ఆలౌటైంది. తర్వాత బంగ్లా టీమ్ ఒక పరుగు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది.