రాంగ్ రూట్‌లో వచ్చిన కారు నేరుగా వచ్చిన కారును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాండూరుకు చెందిన వంశీధర్‌రెడ్డి, అతని అత్త సుజాత, బంధువు రోజా, డ్రైవర్ వెంకట్‌తో కలిసి కారులో ఉదయం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 7 :30 గంటల సమయంలో మొయినాబాద్‌లోని పెంటయ్య హోటల్ దగ్గర రాగానే హైదరాబాద్ నుండి చేవెళ్ల వైపు ఓ కారు రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చి వంశీధర్‌రెడ్డి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాంగ్‌రూట్‌లో వచ్చిన కారు డ్రైవర్ కరీంకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అదే కారులో ఉన్న లోకేష్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో భాస్కర్ అనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో బాబురావు, అఖిల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వంశీధర్ రెడ్డి, అతని అత్త సుజాత, బంధువు రోజా, డ్రైవర్ వెంకట్ కూడా గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వంశీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.