బంగ్లాదేశ్ లోని ఢాకాలో శుక్రవారం ఉదయం 10.38 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.7 గా నమోదైంది. అనేక చోట్ల భవనాలు ధ్వంసమై, అగ్ని ప్రమాదాలకు దారి తీసింది. ఢాకాకు ఈశాన్యంగా 50 కిమీ దూరంలో ఉన్న నర్సింగ్‌డిలో 10 కిమీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు బంగ్లాదేశ్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఢాకాలో ముగ్గురు చనిపోగా, నారాయణ్‌గంజ్ రేవు పట్టణంలో నాలుగో వ్యక్తి,
నర్సింగ్‌డిలో మరో ఇద్దరు చనిపోయారు. పాత ఢాకా లోని ఆర్మనిటోలలోఐదంతస్తుల భవనం వెదురు పరంజా,శిధిలాలు కూలి ముగ్గురు చనిపోయారని, అక్కడే రోడ్డు పక్కన ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని ఢాకా డిప్యూటీ పోలీస్ కమిషనర్ మల్లిక్ ఆసన్ యుద్దిన్‌సైనీ తెలియజేశారు. మృతుల్లో ఒకరు మెడికల్ స్టూడెంట్ అని నిర్ధారించారు. ఢాకా లోని శివారు ప్రాంతం బరిధారలో భూప్రకంపనలకు ఒక నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించిందిన. సబర్బన్ మున్షిగంజ్‌లో గాజారియా ఏరియాలో నివాస భవనంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది.
భారత్ లోనూ భూకంప ప్రభావం
కోల్‌కతాతోపాటు ఉత్తర భారతంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. కోల్‌కతాలో ఉదయం 10.10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. బెంగాల్ లోని కూచ్‌బెహార్, దక్షిణ్, ఉత్తర దినాజ్‌పూర్ సహా అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి.అస్సోం లోని గువాహటి,అగర్తల, షిల్లాంగ్ వంటి నగరాల్లో భూమి కంపించింది. ఈ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.