కాంగ్రెస్ పార్టీకి రివేంజ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఫార్ములా- ఈ రేసు కేసులో కెటిఆర్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయన అన్నారు. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అవసరం లేదన్నారు. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని ఆయన తెలిపారు. కెటిఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, కూట్రపూరితంగానే ఫార్ములా-ఈరేసు కేసులో ఇరికిస్తున్నారని బిఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమను నమ్మి అధికారం ఇచ్చారని, ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.