ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులతో పాటు 108కి సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన స్థలాన్ని ఎస్‌ఐ నాగరాజు పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్‌ఐ నాగరాజు వెల్లడించారు. ఈ బస్సులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి పోలీసులు రంగంలో దిగారు.