దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని కెటిఆర్ ఆరోపించారు. 9,292 ఎకరాలు అంటే సుమారు 9,300 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసుందుకు రేవంత్‌రెడ్డి ముఠా కుట్ర చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు భూములను అప్పజెప్పే యత్నం జరుగుతోందని ఆరోపించారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హెచ్‌ఐఎల్‌టిపి) పేరిట ముఖ్యమంత్రి రూ. 5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణం అనిపేర్కొన్నారు. క్యాబినెట్ మీటింగ్‌లోనే ప్రభుత్వం ఈ భారీ స్కామ్‌కు తెరలేపిందని అన్నారు. ఈ విధానం ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే రూపొందించబడిందని ధ్వజమెత్తారు.
పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూమిని పెద్ద పెద్ద గద్దలకు దారాదత్తం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.సిఎం రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పారిశ్రామికవేత్తలు పడొద్దని సూచించారు. పెరిగిన భూముల విలువను.. రేవంత్ పెటిఎంగా మార్చుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. మెట్రో భూములు, సెంట్రల్ యూనివర్శిటీ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని, ఇప్పుడు పరిశ్రమల భూములపై దృష్టి సారించారని ఆరోపించారు. ప్రజల ఆస్తిని ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు అప్పజెప్తున్నారని.. బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా విచారణ జరుపుతామని వెల్లడించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌ఐఎల్‌టిపి వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ ఉపయోగ విలువైన రియల్ ఎస్టేట్‌గా మార్చడానికి రూపొందించబడిందని పేర్కొన్నారు. ఇది కేవలం పాలసీ కాదు అని, రూ. 5 లక్షల కోట్ల స్కామ్ కోసం రూపొందించిన బ్లూప్రింట్ అని ఆరోపించారు.