నవీ ముంబై: టీం ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన కొద్ది రోజుల క్రితం ప్రపంచకప్‌ను ముద్దాడింది. సౌతాఫ్రికా మహిళ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్ గెలిచిన చోట స్మృతికి మరో సర్‌ప్రైజ్ లభించింది. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ మేరకు పలాష్ ఆమెకు జీవితంలో మర్చిపోలేని విధంగా ప్రపోజ్ చేశాడు.
నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో స్మృతికి పలాష్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ముందుగా స్మృతి కళ్లకు గంతలు కట్టి స్టేడియం మధ్యలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె కళ్ల గంతలు విప్పి.. మెకాళ్లపై కూర్చొని చేతిలో ఎర్ర గులాబీ బొకే, డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. ఈ ఊహించని సర్ ప్రైజ్‌తో స్మృతి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం పలాష్ వేలికి ఆమె ఉంగరాన్ని తొడిగింది. చివరికి ఇద్దరు తమ ఎంగేజ్‌మెంట్ రింగ్స్‌తో కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.