హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ నెల 15వ తేదీన ‘గ్లోబ్‌ట్రాటర్’ అనే పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి చిత్ర టైటిల్‌ను, చిన్న గ్లింప్స్‌ను విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్ రాజమౌళి దేవుడి గురించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు.
‘‘దేవుడి భక్తులంటూ రాజమౌళిపై విషం కక్కుతున్న వాళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నమ్మకపోవడం అనే హక్కును రక్షిస్తోంది. కాబట్టి విషం కక్కేవారు తాము నమ్ముతామని చెప్తున్నట్లుగా.. తాను నమ్మనని చెప్పే హక్కు రాజమౌళికి ఉందని గ్రహించాలి. ఇప్పుడు దేవుడిని నమ్మకపోతే.. తన సినిమాల్లో దేవుడిని ఎందుకు చూపిస్తాడు? అనే వాదనకు వద్దాం. ఒక చిత్ర నిర్మాత గ్యాంగ్‌స్టర్ సినిమా తీయడానికి గ్యాంగ్‌స్టర్‌గా మారాలా? భయానక చిత్రం తీయడానికి దెయ్యంలా మారాలా? అలాగే దేవుడిని నమ్మనంత మాత్రానా మూవీస్ చేయకూడదని రూల్ లేదు కదా.
సత్యాన్ని గ్రహించకుండా ఆయనను తిట్టే గ్యాంగ్‌స్టర్స్ గురించి మాట్లాడుకుంటే.. అతడు దేవుడిని నమ్మకపోయినా, దేవుడు 100 రెట్లు ఎక్కువ విజయం, ఎక్కువ సంపద అభిమానుల ఆరాధనను ఇచ్చాడు. రాజమౌళికి దక్కిన అదృష్టాన్ని చాలా మంది దేవుడిని నమ్మేవాళ్లు వంద జన్మల్లోనూ చేయలేరు.. చూడలేరు. దేవుడు నాస్తికులనే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇవన్నీ దేవుడు పట్టించుకోడు. నోట్‌ప్యాడ్‌తో కూర్చుని ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు అనే దాని గురించి రాయడు కదా.
కాబట్టి నిజమైన సమస్య అతని నాస్తికత్వం కాదు. రాజమౌళి దేవుడిని నమ్మకుండా విజయం సాధించాడు. పిచ్చివాళ్లలా ప్రార్థించిన తర్వాత కూడా ఘోరంగా విఫలమైన వారిని ఎంతోమందిని చూస్తున్నాం. కాబట్టి విశ్వాసులు దేవుడిని సమర్థించడం మానేయాలి. ఎందుకంటే అది ఆయన్ను అవమానించడం వంటిది. నిజం ఏమిటంటే రాజమౌళి నాస్తికుడు కావడం వల్ల దేవుడి స్థాయి తగ్గదని మూర్ఖులంతా గుర్తించండి. విమర్శలు చేసేవారు కాస్త విశ్రాంతి తీసుకోండి. దేవుడు బాగున్నాడు.. రాజమౌళి బాగున్నాడు. వారిద్దరినీ అర్థం చేసుకోలేని వ్యక్తులు మాత్రమే బాధపడుతున్నారు. కాబట్టి ‘వారణాసి’ ద్వారా దేవుడు రాజమౌళికి మరో భారీ అదృష్టాన్ని జోడిస్తాడు. ఇదంతా దేవునిపై నమ్మకంగా ముసుగు వేసుకున్న వారంతా అసూయతో చేస్తున్నదే.. జై శ్రీరామ్’’ అంటూ ఆర్‌జివి పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.