పెర్త్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నూతన ఎడిషన్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ ఆసక్తికర పోరులో మొదటి టెస్ట్‌లోనే ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ వీర విజృంభణతో మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్వల్పస్కోర్‌కే ఆలౌట్ అయింది. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో తన తొలి ఓవర్‌లోనే స్టార్క్ ఇంగ్లండ్ బ్యాటర్ జాక్ క్రాలీని డకౌట్ రూపంలో పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత బెన్ డకెట్(21)ని ఏడో ఓవర్‌లో, వరల్డ్ నెం.1 ఆటగాడు జో రూట్‌ని ఔట్ చేశాడు. ఈ వికెట్లతో యాషెస్ సిరీస్‌లో వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
దీంతో కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్ జట్టును ఓలీపోప్ (46), హ్యారీ బ్రూక్2లు ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ, గ్రీన్ బౌలింగ్‌లో బ్రూక్ ఔట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు స్టార్క్ వికెట్లు పడగొట్టడం ఆపలేదు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు స్టార్క్. దీంతో ఇంగ్లండ్.. 32.5 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జెమీ స్మిత్ 33 పరుగులతో ఫర్యాలేదు అనిపించాడు. మిగితా ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో స్టార్క్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్‌ని(7/58) సాధించాడు. అంతేకాక.. పెర్త్ స్టేడియంలో ఇది అత్యుత్తమ వ్యక్తిగత పిగర్స్. దీంతో పాటు 21వ శతాబ్ధంలో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు ఇది రెండో 7 వికెట్ల ప్రదర్శన కావడం విశేషం.
ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోంది. ఆస్ట్రేలియాకు జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్‌లోనే షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్ రెండో బంతికి ఈ మ్యాచ్‌తోనే ఆరంగేట్రం చేసిన జేక్ వెదరాల్డ్(0)ను డకౌట్ చేశాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 1 వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజ్‌లో లబుషేన్ (9), స్మిత్ (9) ఉన్నారు.