ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పాఠశాల పాఠ్యగ్రంథాల నుంచి సైన్సు, చరిత్రకు సంబంధించి పలు అంశాలను తొలగించింది. నిజానికి అవి చాలా చాలా ముఖ్యమైన అంశాలు. జీవ పరిణామాన్ని విజ్ఞాన శాస్త్ర సిలబస్‌లో లేకుండా చేయడం తాము నమ్మే సృష్టి సిద్ధాంతాన్ని రాబోయే తరాలు నమ్ముతూ ఉండాలనుకోవడం నేటి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ప్రభుత్వ విధానం. అలాగే చరిత్ర పాఠ్యపుస్తకాల నుండి మొత్తానికి మొత్తంగా మొఘలుల పాలనా కాలాన్ని తొలగించడం, వారి విద్వేష పాలసీ విధానానికి అనుగుణంగా చేసిందే! టిప్పు సుల్తాన్ దేశభక్తిని మరుగుపరచడం కూడా అలాంటిదే!! ముస్లింలు, మైనారిటీలు, దళితులంటే వారికున్న ద్వేషభావాన్ని ప్రత్యక్షంగా చూపించడమే! పాఠ్యగ్రంథాల సిలబస్‌లు మార్చుకున్నంత మాత్రాన అసలు చరిత్ర మారదు కదా? చారిత్రక ఆనవాళ్లు తుడిచిపెట్టుకుపోవు కదా? ఆర్కియాలజీ విభాగం వారి రిపోర్టులో, ప్రపంచ వ్యాప్తంగా వందల మంది చరిత్రకారులు రాసిన చరిత్ర గ్రంథాలు మాట్లాడుతూనే ఉంటాయి కదా? ఆయా విషయాల మీద వాస్తవికతకు అద్దం పడుతూ వెలువడిన సినిమాలు, నాటకాలు, ఇతర సృజనాత్మక రచనలు నేటి ప్రభుత్వపు అబద్ధపు ప్రచారాల్ని బట్టబయలు చేస్తూనే ఉంటాయి కదా?
మొఘలుల చరిత్ర ఏదో కొద్ది కాలంది కాదు.. ఈ నేల మీద పరిపాలన సాగిస్తూ, సుమారు నాలుగు శతాబ్దాల పాటు ఇక్కడే పాతుకుపోయింది. అంతేకాదు, ఈ దేశంలో అంతర్భాగమైపోయింది. మొఘలుల తర్వాత వచ్చిన బ్రిటీష్ వారు ఈ దేశాన్ని దోచుకుపోయారు. దోచుకున్నది తీసుకుపోయి బ్రిటన్‌లో పెట్టుకున్నారు. ఉదాహరణకు మన ప్రాంతం నుండి తీసుకుపోయిన కోహినూర్ వజ్రం. బ్రిటీష్ రాణి కిరీటంలో ధగధగా మెరిసింది కదా? మరి మొఘలులు దోచుకున్నదేమిటీ? దోచకుంటే అది వారెక్కడికి తీసుకుపోయారు? అని భావితరాల పౌరులు ప్రశ్నలు సంధించరా? మొట్టమొదట దేశంలోకి ప్రవేశించిన బాబర్ తప్ప, మిగిలిన మొఘల్ చక్రవర్తులందరూ ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి ఇక్కడే కన్నుమూశారు కదా? ఈ దేశపు మట్టిలో మట్టయిపోయారు. భారతీయ జనజీవితంలో ఐక్యమైపోయారు.
సాధారణ శకానికి పూర్వం ఎప్పుడో అశోక చక్రవర్తి పరిపాలించిన సువిశాలమైన భూభాగాన్ని మళ్లీ మొఘలులు ఆక్రమించి సుస్థిరపరిచారు. ఇతర చొరబాటుదారులు దేశంలో చొరబడకుండా అడ్డుకుంటూ శత్రుదుర్భేద్యంగా నిలబడ్డారు. శతాబ్దాలు గడిచిపోతున్నా ప్రపంచ పర్యాటకులు మొఘలుల కట్టడాలను చూడడానికి విపరీతంగా వస్తున్నారు కదా? తాజ్‌మహల్, లాల్‌ఖిలా, హుమయూన్ సమాధి, ఆగ్రా కోట, బులంద్ దర్వాజ వంటివన్నీ యునెస్కో వరల్డ్ హెరిజేట్ స్థలాలుగా గుర్తింపు పొందాయి కదా? కాదంటారా? రోజూ వేల మంది సందర్శకులకు ఆ కట్టడాల నేపథ్యం తెలియనీయకుండా జాగ్రత్త పడతారా? అక్బర్, షాజహాన్‌ల పేర్లు బయటికి రానీయకుండా బిజెపి పాలనలో మోడీ చక్రవర్తి అవి కట్టించాడనీ చెప్పుకుంటారా? చెప్పుకున్నా చెప్పుకుంటారు. ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. వారి అబద్ధపు ప్రచారాలు, ఆర్భాటాలు ఎంత దిగజారుడు స్థాయిలో ఉంటున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం కదా? ఇక, తామే ఎల్లకాలమూ అధికారంలో ఉంటామన్న భ్రమలో నేటి ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుంది. కాల ప్రవాహంలో మార్పు సహజం అని గ్రహించలేకపోతున్నారు. గతంలో హిట్లర్ కూడా ఇలాగే మార్పులు చేయించాడు. మరి ఎల్లకాలమూ అధికారంలో ఉండలేకపోయాడు కదా!
ఇక సైన్స్ పాఠ్యగ్రంథాల నుండి జీవపరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం గురించి చూద్దాం. మనిషిగా పుట్టిన ప్రతివాడూ తప్పక తెలుసుకోవాల్సిన అంశం జీవ పరిణామం. ఇది ఏ ఒక్క దేశానికో సంబంధించిన విషయం కాదు. కేవలం జీవశాస్త్రం అభ్యసించే విద్యార్థులు చదువుకునేది కూడా కాదు. ప్రపంచ పౌరులందరూ అధ్యయనం చేయాల్సిన విషయం. అర్థం చేసుకోవాల్సిన విషయం. చదువులేని వారు సైతం చదువుకున్న వారిని అడిగి, సారాంశం తెలుసుకోవాల్సిన విషయం. కొన్ని లక్షల ఏళ్లపాటు కొనసాగిన మానవుడి తొలిదశలు ఏవో, అవి ఎంతెంతగా సంఘర్షిస్తూ వచ్చాయో వాతావరణ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటూ వచ్చాయో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అవగతం చేసుకుంటూ ఎదుగుతూ, పరిణామం చెందుతూ ఇప్పటి ఈ స్థితికి ఎలా చేరుకున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది! ఏకకణ జీవుల నుండి, బహు కణ జీవుల నుండి, వెన్నెముక లేని జంతువుల్లో జరిగిన జీవ పరిణామం తొలి దశ అయితే.. అందులో నుండి వెన్నెముక గల జీవులు చేపలు, ఉభయచరాలు సరీసృపాలు పక్షులు ఆ తర్వాత హొమినిడికి చెందిన వానరాలు, అందులో నుండి తొలి మానవ దశలు రావడం మలిదశ.
ఒకానొక కాలంలో ఎన్నో తొలి మానవ దశలు కలిసి, ఏక కాలంలో ఈ నేల మీద సంచరించాయి. ఆహారం కోసం పోటీపడి కొట్లాడుకున్నాయి. అలా ఆ ఘర్షణల్లో తెలివైన జాతి హోమో సేపియన్ గెలుస్తూ, తన జాతిని కొనసాగించుకుంటూ వచ్చింది. మిగిలిన జాతులన్నీ క్రమంగా అంతరించిపోయాయి. హోమో అనేది మానవ జాతికి సంబంధించిన జీనస్, సేపియన్ అనేది స్పీసీస్. ‘సేపియన్’ అంటే వివేకం గలది అని అర్థం. సేపియన్‌గా ఈ భూమి మీద బతుకుతున్నందుకు ప్రతి ఒక్కరూ తమ వివేచనను ఉపయోగిస్తూ ఉండాలి! అందువల్ల ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో ఉన్న మానవుడైనా, అతను హోమో సేపియనే అంటే, మనుషులంతా ఒక్కటే అని కదా అర్థం. ఆ రకంగా ప్రతి మనిషీ విశ్వమానవుడే! అనాగరికతను వదిలేస్తూ మనిషి నాగరికుడిగా ఎలా తయారయ్యాడో, మనిషి కేంద్రంగా అతను ఆధునిక, అత్యాధునిక యుగాలను ఎలా నిర్మించుకుంటూ వచ్చాడో తెలుసుకోవాలంటే తప్పదు ప్రతి ఒక్కరూ జీవ పరిణామ శాస్త్రం చదువుకోవాల్సిందే!
దైవ విశ్వాసంలో నిండా మునిగి, ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ లాంటి అంధ విశ్వాసాల్లోనే జీవన సత్యం ఉందనుకునే వారికి జీవ పరిణామం అక్కర లేదు అబద్ధాలు పూర్తిగా నమ్ముతూ, నిజాలకు రుజువులడిగే అతి తెలివిగాళ్లకు నిజమే జీవ పరిణామ శాస్త్రం అక్కర లేదు. ఆత్మ విశ్వాసాన్ని తొక్కిపెట్టి, దైవ విశ్వాసానికి భజనలు చేసే వారికి అవును జీవపరిణామం అక్కర లేదు. జీవ పరిణామ శాస్త్రం హేతువాదానికి మూలం! మానవ వాదానికి మూలం! స్వేచ్ఛాలోచనకు మూలం! విశ్వ దృష్టికి మూలం! జీవ పరిణామమంటే చీకటి లోంచి వెలుగులోకి చేసిన ప్రయాణం! అజ్ఞానం లోంచి జ్ఞానంలోకి చేసిన ప్రయాణం! మనిషి, మనిషి విలువను తెలుసుకోవడానికే, మానవ జీవ పరిణామ గురించి తెలుసుకోవాలి! మరి వీటిలో ఏ ఒక్కటీ గుర్తించలేని వారు, భరించలేనివారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి, వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాబోయే తరాల్ని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారు.
ఏ ప్రభుత్వమైనా ముఖ్యంగా చేయాల్సినవి రెండు పనులు. 1. విద్య 2. వైద్యం దేశ ప్రజలకు బాధ్యతతో అందించాలి! వైద్యం సమకాలీన సమాజంలో బతికి ఉన్న పౌరులకు మాత్రమే పని కొస్తుంది. కాని, విద్య రాగల భవిష్యత్ తరాలకు కూడా అందుతూ ఉండేది. సరైన విద్య అందించకుండా ఒక తరాన్ని తయారు చేస్తే, దాని ప్రభావం రాబోయే ఎన్నో తరాల మీద పడుతుంది. ఆలోచించి చూడండి వైద్యం కన్నా విద్య ఎంత ముఖ్యమైందో. వైద్య చాలా అవసరమే. దేశ పౌరులు ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తరాలు ఆరోగ్యంగా పుడతారు. నిజమే! కాని అధిక సంఖ్యలో అజ్ఞానులు పుట్టినందు వల్ల దేశానికి ఏం లాభం? సమాజ గతిని మార్చే జ్ఞానులుకొంత మందైనా తయారు కావాలి కదా? అందుకే ప్రభుత్వాలు హేతుబద్ధమైన విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలి. మనకు నిత్య జీవితంలో అందుబాటులోకి వస్తున్న అనేకానేక వైజ్ఞానిక పరికరాలు ఏ కొద్ది మంది శాస్త్రజ్ఞులో కనుకున్నవి. మరి కొద్ది మంది సాంకేతిక నిపుణులు తయారు చేస్తున్న వీను! అత్యధిక ప్రపంచ జనాభా వాటిని సుఖంగా, సులభంగా వాడుకుంటోంది కదా?
సమాజ గతిని మార్చగల శక్తిసామర్థాలు ఎప్పుడైనా ఏ కొది మందికో ఉంటాయి. ఆ కొద్ది మంది తయారు కావడానికి ప్రభుత్వాలు అన్ని అవకాశాలు కల్పించాలి. అంతేగాని, మెదళ్లు కత్తిరించి, రెక్కలు కత్తిరించి, మాటను కత్తిరించి, ఆలోచనను కత్తిరించి ప్రభుత్వం వివేకవంతుల్ని తయారు చేయలేదు. పాఠ్య పుస్తకాల్లోంచి అవసరమైన విషయాలు తొలగించడమంటే, నిజాల్ని తొక్కి పెట్టడమే. సమాజాన్ని నిస్సత్తుగా మార్చడమే. యువత జ్ఞాన సంపన్నలై ఎక్కడ ప్రశ్నలు సంధిస్తారోనని ఒక రకంగా ప్రస్తుత ప్రభుత్వం భయపడుతున్నట్టుగా ఉంది.
నిజాల్ని దాచిపెట్టి తమ హిందుత్వ ఎజెండాను తెచ్చి, సృష్టి సిద్ధాంతాన్ని బాలబాలికల మెదళ్లలో కుక్కి, రాజ్యాంగాన్ని పక్కకు తోసి, మనుస్మృతిని వాడుకలోకి తేవాలన్నది ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల ఉద్దేశం. ఆ దిశలో వాళ్లు మొదటి నుండి పని చేస్తున్నారు. సమస్యలు ఎదురైనప్పుడు కాళ్ల బేరానికి రావడం వాళ్లకు అలవాటు. బ్రిటీష్ వారికి క్షమాపణలు చెప్పి స్వాతంత్య్రోద్యమంలో ఆనాటి యువతీ యువకులు పాల్గొనకుండా అడ్డుకున్నది వీరే. నెహ్రూ ప్రభుత్వంలో హోం మంత్రి సర్దార్ పటేల్ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తే క్షమాపణలు చెప్పి బయటపడింది వీరే. తమ కార్యకర్తల్నిన విడిపించుకోవడానికి ఇందిరా గాంధీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పి నాటి ఎమర్జన్సీని బలపరిచింది వీరే. ఇప్పుడు మళ్లీ వారే అప్పటి ఎమర్జన్సీని విమర్శిస్తున్నారు. మొఘలులు ముస్లింలు గనక, ఈ దేశంలోని హిందువులంతా వారిని ద్వేషించాలన్నది అధికారంలో ఉన్న అతి పెద్ద రాజకీయ పార్టీ భావిస్తోంది.
– డాక్టర్. దేవరాజు మహారాజు