మన భారతదేశానికి ఊహించని ప్రమాద ఘంటికలు మున్ముందు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఏ దేశానికైనా ప్రధాన ఆర్థిక వనరు మానవ వనరు. అందులోనూ యువతే దేశానికి ప్రధాన ఆర్థిక వనరు. దేశంలో యువత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంతవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ కారణం చేతనే తన దేశంలో యువత సంఖ్యను గణనీయంగా పెంచేందుకు చైనా అధిక సంతానం దేశంగా అక్కడి ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఇలా ప్రతి దేశం యువత సంఖ్య పెంచేందుకు నానాపాట్లు పడుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా మన దేశంలోని వాతావరణం కనిపిస్తోంది. దేశానికి నేడు యువత సంఖ్య బలంగా ఉంది. ఇది సంతోషించదగ్గ పరిణామమైతే ఈ వనరు ఆ కారణంగా చేజారుతోందన్న ఆందోళనకరమైన పరిస్థితి మరోవైపు కనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. భారత యువతలో ఆత్మహత్యలు పెరుగుదల. భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతున్న ఈ తరుణంలో, ఆ విజయాల వెను దాగిఉన్న ఒక చీకటి సత్యాన్ని మనం తప్పక గుర్తించాలి. అదే భారత యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల సంఖ్య.
సాంకేతిక ప్రగతి, ఆర్థికాభివృద్ధి గురించి మనం ప్రతిరోజూ మాట్లాడుతున్నా మన యువతరం ఎదుర్కొంటున్న భావోద్వేగ పోరాటాల గురించి మాట్లాడటానికి మాత్రం చాలా అరుదుగా సిద్ధమవుతున్నాం. ఈ నిశ్శబ్దం ఇప్పుడు ప్రాణాలను బలిగొంటోంది. భారత ప్రజా ఆరోగ్య ఫౌండేషన్ (పిహెచ్‌ఎఫ్‌ఐ) తాజా నివేదిక అందించిన గణాంకాలు మనల్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. 15 39 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయుల్లో ఆత్మహత్యలు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారుతోంది. ఇది కేవలం ఒక గణాంకం కాదు. ఇది మన సామాజిక వ్యవస్థలోని లోపాలను, కౌన్సిలింగ్ సేవల్లోని అంతరాలను, మానసిక ఆరోగ్యానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత లేమిని ఎత్తిచూపుతోంది. మన యువతరం అనేక వైపులనుండి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలు, కొద్దిపాటి ఉద్యోగాలకోసం తీవ్రమైన పోటీ.
ఇవన్నీ యువతపై అపారమైన మానసిక భారాన్ని మోపుతున్నాయి. వైఫల్యంపై ఉన్న సామాజిక తీర్పు, భయం వారిని మరింత కృంగదీస్తోంది. తమ పిల్లలు డాక్టర్లు లేదా ఇంజినీర్లు కావాలన్న తల్లిదండ్రుల అంచనాలు, వాటిని చేరుకోలేకపోతున్నామన్న భావన యువతలో ఆందోళనను పెంచుతోంది. సోషల్ మీడియాలో ఇతరుల ‘పరిపూర్ణమైన’ జీవితాలు, విజయాలు చూసి, తమ జీవితాలు అంత గొప్పగా లేవని భావించడం, నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వంటివి యువతలో తీవ్ర నిరాశ, ఒంటరితనాన్ని పెంచిపోషిస్తున్నాయి. దురదృష్టవశాత్తు సమాజంలో మానసిక సమస్యలు అంటే ‘బలహీనత’ అనే అపోహ ఉంది. ‘మనసు బాగోలేదని’ చెబితే సమాజం చిన్నచూపు చూస్తుందనే భయంతో చాలామంది యువకులు సహాయం అడగడానికి సంకోచిస్తున్నారు. ఈ ఆలస్యమే ప్రాణాలను తీస్తోంది. కేవలం అవగాహన ప్రచారాలు సరిపోవు.
మనకు ఇప్పుడు అత్యవసరం వ్యవస్థాత్మక మార్పులు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అకడమిక్ విజయాలకే కాకుండా, భావోద్వేగ ఎదుగుదలకు, ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పడానికి ప్రత్యేకమైన తరగతులు, సెమినార్లు నిర్వహించాలి. ప్రతి విద్యా సంస్థలో అనుభవజ్ఞులైన, సులభంగా అందుబాటులో ఉండే కౌన్సిలర్‌లు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి వుంది. ఉద్యోగ స్థలాల్లో మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెరుగైన పని వాతావరణాన్ని సృష్టించాలి. ఉద్యోగులకు గోప్యతతో కూడిన కౌన్సిలింగ్ సేవలు అందించాలి. ఉద్యోగులు విరామం తీసుకోవడానికి, వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడానికి ప్రోత్సహించాలి. కౌన్సిలింగ్, థెరపీ వంటి సేవలు శారీరక చికిత్సల మాదిరిగానే సాధారణంగా, ఆర్థికంగా అందుబాటులో ఉండాలి. గ్రామీణ ప్రాంతాలకు కూడా మానసిక ఆరోగ్య నిపుణుల సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వారి భారాన్ని పంచుకోవాలి, వారికి అవసరమైన మద్దతును అందించాలి. మానసిక ఆరోగ్యం ఐచ్ఛికం కాదు, అత్యవసరం. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మనం అందరం ఒక్కటిగా నిలవాలి.
– సయ్యద్ నిసార్ అహ్మద్
– 7801019343